అలాంటివి ఆయ‌న దృష్టిలో నేరాలు.. అందుక‌నే నా పై కేసులు : నారా లోకేష్

By సుభాష్  Published on  27 Oct 2020 8:47 AM GMT
అలాంటివి ఆయ‌న దృష్టిలో నేరాలు.. అందుక‌నే నా పై కేసులు : నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సోమవారం తృటిలో పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పర్యటనలో భాగంగా సిద్ధాపురం వద్ద లోకేష్‌ ట్రాక్టర్ నడిపారు. ఈ సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను అదుపు చేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆయన వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, తెలుగు తమ్ముళ్లు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా.. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్రాక్టర్ నడుపుతూ ఈ ఘటనకు కారణమైనందుకు ఆయనపై కేసు నమోదైంది. అలాగే కోవిడ్‌ 19 నిబంధనలను లోకేష్ పట్టించుకోలేదని ఆ ఫిర్యాదులో పొందపరిచారు. అక్కడి రోడ్లపై అవగాహన లేకుండానే లోకేష్ వరద ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి కారణమయ్యారని, కొందరి ప్రాణాలకు హాని కలించేలా వ్యవహరించారని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో 279, 184, 54A కింద ఆకివీడు పోలీసులు లోకేష్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు కక్షచర్యల్లో భాగంగానే లోకేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇక త‌న‌పై పెట్టిన కేసుల‌పై నారా లోకేష్ స్పందించారు. ‘రైతుల్ని పరామర్శించడం, రైతులకి అండగా పోరాటం చెయ్యడం, రైతులకి న్యాయం చేయాలని డిమాండ్ చెయ్యడం వంటివి వైఎస్ జగన్ దృష్టిలో నేరాలు. ఈ నేరాలపై కేసులు పెట్టే సెక్షన్లు ఆయన పోలీసుల వద్దలేవు. అందుకే కొవిడ్ నిబంధనలు ఉల్లంఘన, ట్రాక్టర్ నడిపారంటూ నాపై కేసులు బనాయించారు’ అని ఆయన అన్నారు.

‘వరద బాధితులను పరామర్శించేందుకు గడప దాటని జగన్ రెడ్డి, గడప గడపకీ వెళ్లే నన్ను అడుగడుగునా అడ్డుకోవాలనుకుంటున్నారు. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో! కష్టాలలో ఉన్నోళ్ల కన్నీరు తుడిచేందుకు ప్రతీ ఊరూ వెళతా! ప్రతి గడపా తొక్కుతా! బాధితులకు భరోసానిస్తా’ అని నారా లోకేశ్ ట్వీట్లు చేశారు.Next Story
Share it