అక్కడ కరోనా మరణాల కన్నా..లాక్ డౌన్ కాల్పుల మరణాలే అధికం

By రాణి  Published on  17 April 2020 1:43 PM GMT
అక్కడ కరోనా మరణాల కన్నా..లాక్ డౌన్ కాల్పుల మరణాలే అధికం

ప్రపంచ వ్యాప్తంగా మృత్యుఘోష పెడుతోన్న కరోనా..రోజురోజుకూ మానవజాతి పై పగబట్టినట్లే విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 21 లక్షలు దాటగా..మరణాల సంఖ్య లక్షా 45 వేలు దాటింది. దీనిని బట్టి చూస్తే 24 గంటలు గడిచే లోపు ప్రపంచ దేశాల్లో కనిష్టంగా 70 వేల నుంచి 1,00,000 వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో శుక్రవారం వరకూ 13,835 కేసులు నమోదవ్వగా 452మంది చనిపోయారు. మరో 1767 మంది కోలుకున్నారని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా చావు కేకలు వినిపిస్తుంటే ఒక్కదేశంలో మాత్రం లాక్ డౌన్ కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. అదే నైజీరియా. అక్కడ లాక్ డౌన్ విధించినా ఆ ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయకుండా బయట తిరిగేవారిని కాల్చి చంపేస్తున్నారు.

Also Read : వివాదాస్పదంగా హీరో నిఖిల్ పెళ్లి..!

నైజీరియాలో మొత్తం 407 కరోనా కేసులు నమోదవ్వగా 12 మంది వైరస్ కారణంగా చనిపోయారు. కానీ లాక్ డౌన్ లో కనిపించిన వారిపై నైజీరియా సైన్యం, పోలీసులు కాల్పులు జరుపుతుండటంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసిన మానవ హక్కుల సంఘాలు నైజీరియా సైన్యంపై ఆగ్రహిస్తున్నాయి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ నైజీరియా అధికారులు దీనిపై మాట్లాడుతూ..ప్రజల జీవన హక్కును సైన్యం, పోలీసు బలగాలు తమ చేతుల్లోకి తీసుకున్నాయని ఆరోపించారు. ఏ పాపం ఎరుగని 18 మందిని అన్యాయంగా హతమార్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నైజీరియా కరెక్షనల్ సర్వీస్ ఎనిమిది మందిని, నైజీరియా పోలీస్ ఫోర్స్ ఏడుగురును, నైజీరియా ఆర్మీ ఇద్దరిని, ఎబోన్యీ స్టేట్ టాస్క్‌ఫోర్స్ ఒకరిని కాల్చి చంపేసినట్లు స్థానిక మానవ హక్కుల సంఘం వెల్లడించింది. నైజీరియాలో ఉన్న మొత్తం 36రాష్ట్రాల్లో కెల్లా 24 రాష్ట్రాల నుంచి మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 13 వరకు ఇలాంటి ఫిర్యాదులు వచ్చినట్లు మానవ హక్కుల సంఘం తెలిపింది.

Also Read : ఏప్రిల్, మే నెలల్లోనే పెళ్లిళ్లకు ఎందుకంత ప్రాధాన్యం ?

కనిపిస్తే కాల్చి చంపేయడమే కాకుండా..కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా ఆస్తులను సైతం స్వాధీనం చేసుకుంటున్నారన్న ఫిర్యాదులొస్తున్నాయన్నారు. దోపిడీలు, అక్రమ అరెస్టులు కూడా చేస్తున్నారన్నారు. కానీ ఈ ఆరోపణలను నైజీరియా పోలీస్ అధికార ప్రతినిధి ఫ్రాంక్ ఎంబా తీవ్రంగా ఖండించారు. ప్రజలను పోలీస్ వ్యవస్థ, సైన్యం అన్యాయంగా చంపేస్తుందన్న మానవహక్కుల సంఘం ఎవరెవరు, ఎక్కడెక్కడ చంపింది వారి వ్యక్తిగత వివరాలతో సహా తమకు ఇవ్వాలని, తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

దీనిని బట్టి చూస్తే అన్ని దేశాల కన్నా మన భారతదేశమే బెటర్ అనిపిస్తుంది కదూ. అందుకే అనవసరంగా బయట తిరగకుండా ఇంటి పట్టునే ఉండండి. ఒకవేళ అవసరమై బయటికెళ్లి మహా అయితే పోలీసులు చిన్న చిన్న శిక్షలేస్తారు. అంతేగానీ నైజీరియా లాగా కనిపిస్తే కాల్చి చంపేయరు కదా. పోలీసులను గౌరవిద్దాం.

Next Story