హైదరాబాద్ : నిర్భయ ఉదంతం తర్వాత దేశంలో మహిళల రక్షణపట్ల శ్రద్ధ పెరిగింది. దీనికి సంబంధించి కాన్పూర్ లోని రక్షణ పరికరాల తయారీ కర్మాగారం నిర్భీక్ పేరుతో .32 బోర్ తేలికపాటి రివాల్వర్ ను రూపొందించింది. 500 గ్రాములు బరువుండే ఈ తేలికపాటి రివాల్వర్ ను మహిళలు సులభంగా తమ పర్స్ లో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లే వీలుంటుంది.

తాజాగా జరిగిన దిశ ఉదంతం తర్వాత ప్రమాదాలు ఎదురైనప్పుడు మాన, ప్రాణ సంరక్షణకోసం భారతీయ మహిళలు ఆయుధాలను వాడేందుకు సిద్ధపడుతున్నారా? అన్న ప్రశ్న ఉదయిస్తే దానికి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రభుత్వం ఆత్మరక్షణకోసం ఉద్దేశించిన మారణాయుధాలకు లైసెన్స్ ఇస్తే తీసుకోవడానికి, ఆయుధాలను దగ్గరపెట్టుకోవడానికి కొందరు మహిళలు సిద్ధంగా ఉన్నారు.

అమెరికాలో గన్ కల్చర్ చాలా ఏళ్లుగా ఉంది. అక్కడ ఆ దేశంలో ఆత్మ రక్షణకోసం తుపాకీలు కొని పర్సుల్లో, హ్యాండ్ బ్యాగుల్లో పెట్టుకుని తిరిగే మహిళల సంఖ్యా ఎక్కువే. కానీ భారత దేశంలో మాత్రం ఇలా తుపాకులను కొని పర్సులో పెట్టుకోవాలనుకునే మహిళలకు కఠినతరమైన గన్ లైసెన్స్ చట్టాలు అడ్డంపడుతున్నాయి. దీనివల్ల మహిళలు కేవలం కళ్లను మండించే మిరపకాయల స్ప్రేలమీద, మొబైల్ రక్షణ యాప్ లమీద ఇక్కడి మహిళలు ఆధారపడాల్సి వస్తోంది. లేదంటే అలాంటి ఉదంతాలనుంచి కేవలం వాళ్లను వాళ్ల అదృష్టంమాత్రమే రక్షించగలుగుతోంది.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అందించిన వివరాల ప్రకారం జనవరి 2014లో నిర్భీక్ తేలికపాటి రివాల్వర్ ని అందుబాటులోకి తీసుకొస్తే కేవలం ఇప్పటివరకూ 53మంది మహిళలు మాత్రమే నేరుగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి దాన్ని తీసుకోవడానికి ముందుకొచ్చారు. అప్పటినుంచీ దేశవ్యాప్తంగా మొత్తం కేవలం 1500 తుపాకీలుమాత్రమే అమ్ముడయ్యాయి.

రెండేళ్లక్రితమే దీన్ని స్థానికడీలర్లకు విక్రయించడం మొదలయ్యింది. వారిద్వారా అధికారికంగా దీన్ని మహిళలకు విక్రయించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అయినప్పటికీ చాలా తక్కువమంది ఈ దిశగా ఆలోచించి భద్రతకోసం, స్వీయ రక్షణకోసం ఈ రివాల్వర్ ను తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. నిజానికి ఇలాంటి తేలికపాటి ఆత్మరక్షణ ఆయుధం ఒకటి అందుబాటులో ఉందని, దాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి, లైసెన్స్ కూడా లభిస్తుందని దేశంలో చాలా కొద్దిమంది మహిళలకు మాత్రమే తెలుసన్నది నిపుణుల అభిప్రాయం.

గడచిన ఐదు సంవత్సరాల్లో ఆయుధాలను విక్రయించే డీలర్లు నిర్భీక్ తో సహా వివిధ రకాల మోడళ్లకు సంబంధించిన ఐదు వేల రివాల్వర్లను కొనుగోలు చేశారు. నిర్భీక్ రివాల్వర్ కు దాదాపుగా 15 మీటర్ల రేంజ్ ఉంటుంది. దీన్ని టైటానియమ్ అల్లాయ్ తో తయారు చేశారు. ధర కేవలం లక్షా ముఫ్పై తొమ్మిదివేల రూపాయలు మాత్రమే. నిజానికి ఆత్మరక్షణకోసం ఆయుధం కొనుగోలు చేయడానికి ఈమాత్రమైనా ఖర్చు పెట్టగలిగే స్థోమత భారతదేశంలోని మహిళల్లో చాలా తక్కువమందికి ఉందనే చెప్పాలి.

నిర్భీక్ ని చాలా తేలికగా ఉపయోగించగలిగే రీతిలో దీని ట్రిగ్గర్ ని కూడా ప్రత్యేకంగా రూపొందించడం విశేషం. నిశాంక్ పేరుతో మరో కొత్త మోడల్ ని కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఈ మధ్యే విడుదల చేసిందని ఆ ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి సామాన్యుల్లో కొంత మేరకు ఆసక్తి కనిపించిందంటున్నారు.

గన్ లైసెన్స్ కి సంబంధించిన చట్టాలు కఠినతరంగా ఉండడంవల్ల నిజానికి ఆత్మరక్షణకోసం ఆయుధాన్ని దగ్గరపెట్టుకునే అవకాశం మన దేశంలో ఏ కొద్దిమందితో మాత్రమే కలుగుతోంది. అలా కాకుండా సమయాన్ని, సందర్భాన్ని అనుసరించి, మహిళలకు వారి భద్రతకోసం తుపాకీని దగ్గర పెట్టుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి ఎక్కువమందికి గన్ లైసెన్స్ మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయుధాల రిటైల్ విక్రేతలు చెబుతున్నారు.

ఇప్పటివరకూ హైదరాబాద్ లో ఇలా ఆత్మరక్షణకోసం రివాల్వర్ , లైసెన్స్ రెండూ తీసుకున్న వ్యక్తులెవరూ వాటిని దుర్వినియోగం చేసిన దాఖలాలు లేవు. హైదరాబాద్ లో కేవలం ఒక్క నిర్భీక్ తుపాకీ అయినా అమ్ముడుపోలేదని ఆయుధ విక్రేతలు అంటున్నారు. నిజానికి హైదరాబాద్ నగరంలో దాదాపుగా 50 నుంచి 100మంది మహిళలకు గన్ లైసెన్స్ లు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి.

అధికారికంగా దీన్ని ధృవీకరించేందుకు పోలీస్ శాఖ మాత్రం ఇష్టపడడంలేదు. రమారమిగా చెప్పుకోదలచుకుంటే దాదాపుగా వందల్లోనే గన్ లైసెన్స్ లు హైదరాబాద్ మహానగరంలో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్నాయి. భారతీయ ఆయుధచట్టంలో ఉన్న నిబంధనల్లో భద్రతకు సంబంధించిన ముప్పు, పోలీస్ రికార్డుల ప్రకారం ఎలాంటి నేర చరిత్ర లేకుండా ఉండడం అత్యంత కీలకమైన విషయాలు. చాలామంది వెపన్ లైసెన్స్ కోసం దరఖాస్తు పెట్టుకుంటారు కానీ చాలా కొద్దిమందికి మాత్రమే అనుమతి లభిస్తుంది.

నగరశివార్లలోని ఫామ్ హౌసుల్లో నివసించేవారికి భద్రతపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయని, ఆత్మరక్షణకోసం తప్పనిసరిగా వాళ్లకు వీలైనంత హెచ్చు స్థాయిలో గన్ లైసెన్స్ లు ఇవ్వడం చాలా మంచిదని కొందరి అభిప్రాయం. ఒకవేళ ఆ లైసెన్స్ ని తీసుకున్నవాళ్లు దాన్ని దుర్వినియోగం చేస్తే ఎలాగూ ఉన్న లైసెన్స్ ను రద్దు చేసే అధికారం పోలీస్ విభాగానికి, ప్రభుత్వానికి ఉంటుందికనుక వీలైనంతవరకూ ఎక్కువ స్థాయిలో లైసెన్స్ లు మంజూరు చేయడం అవసరమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

గన్ లైసెన్స్ కోసం తమకు అందిన దరఖాస్తులన్నింటినీ పూర్తి స్థాయిలో కూలంకషంగా పరిశీలిస్తామనీ, పూర్తి స్థాయిలో పరిశీలన జరిగిన తర్వాతే అన్ని రకాలైన అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాక మాత్రమే లైసెన్స్ మంజూరు చేయడం జరుగుతుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ చెబుతున్నారు. నిజానికి ఎక్కువ లైసెన్స్ లు మంజూరు చేయడంవల్లే మహిళలకు ఆత్మరక్షణ భరోసా లభిస్తుందనడంకూడా సరైనది కాదన్నది ఆయన నిశ్చితాభిప్రాయం.

నిబంధనలకు లోబడిఉన్నవారికెవరికైనా వెపన్ లైసెన్స్ మంజూరుచేయడం పెద్ద కష్టమైనపనేంకాదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అంటున్నారు. కానీ ఈ విషయంలో పూర్తి స్థాయిలో అర్హతను, అవసరాన్నీ పూర్తి స్థాయిలో అంచనా వేయడంలోమాత్రం పోలీస్ విభాగం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుందని ఆయన చెబుతున్నారు.

కొన్ని సందర్భాల్లో లైసెన్స్ పొందినవారు దాన్ని దుర్వినియోగం చేసిన ఘటనలూ ఉన్నాయి కనుక లైసెన్స్ మంజూరీ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని కొందరు పోలీస్ ఉన్నతాధికారులు అంటున్నారు. కేవలం మానభంగం లేదా దానికి సమానమైన తీవ్రస్థాయి నేరం జరిగే అవకాశం ఉన్న సందర్భంలోనే ప్రాణ రక్షణకోసం మాత్రం తుపాకీని ఉపయోగించడం సబబనే అని అభిప్రాయపడుతున్నారు. చాలా సందర్భాల్లో కేవలం ఆ ఆయుధాన్ని చూపించడంద్వారా ఇతరులను బెదిరించిన కేసులూ అనేకం దృష్టికి వచ్చాయంటున్నారు. అమెరికాలో మాదిరిగా గన్ కల్చర్ ను తారా స్థాయిలో ప్రోత్సహించడంకూడా సరైంది కాదన్న అభిప్రాయంకూడా పోలీస్ ఉన్నతాధికారులనుంచి వ్యక్తమవుతోంది.

నిజానికి నిజంగా కేవలం తుపాకీల వినియోగంవల్లే మహిళలకు పూర్తి స్థాయిలో ఆత్మరక్షణ సాధ్యమవుతుందా అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు కాదన్న సమాధానమే వస్తుందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో ఒకవేళ తుపాకీని కలిగిఉన్నా దాన్ని ఉపయోగించలేని దుస్థితిలో మహిళలు ఉండే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు. వీలైనంతవరకూ సమయస్ఫూర్తితో వ్యవహరించడంవల్లే ఆపదలనుంచి గట్టెక్కడం సాధ్యమంటున్నారు.

వయొలెన్స్ పాలసీ సెంటర్ అధ్యయనాలప్రకారం తుపాకీలు కలిగిఉన్న మహిళలుకూడా అత్మరక్షణకోసం వాటిని ఉపయోగించిన సందర్భాలుకూడా చాలా తక్కువేనట. ఒక కేసులో తుపాకీ కలిగిఉన్న మహిళను ఆమె బంధువు అదే తుపాకీతో కాల్చి చంపిన ఉదంతాన్ని పోలీస్ అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

చాలా సందర్భాల్లో ఆపద ఎదురైనప్పుడు మహిళలు తమ దగ్గర ఉన్న ఆయుధాన్ని చూపించి ఎవరివల్లైతే తమకు ఆపద ఎదురయ్యిందో వారినుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నది, వాస్తవంగా దాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఎదురుకాదన్నది మరో సీనియర్ ఐపిఎస్ అధికారి అభిప్రాయం. దీనివల్ల ఆయుధ లైసెన్స్ ని ఇవ్వడమే మంచిదని చెబుతున్నారు. ఫలానా మహిళ దగ్గర ఆయుధం ఉంది అన్న విషయం నేరగాళ్లకు తెలిసిన మరుక్షణం వీలైనంతవరకూ వాళ్లు ఆమె జోలికి వెళ్లకుండా తప్పుకుని వెళ్లిపోయే ప్రయత్నమే చేస్తారు తప్ప, అపాయానికి ఎదురెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవాలని ఎవరూ ఆలోచించరన్నది ఆ అధికారి నిశ్చితాభిప్రాయం.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.