అభినందన్‌ పట్టుబడిన సమయంలో పాక్‌ చీఫ్‌ జనరల్‌ గజగజ వణికిపోయారట.. ఎందుకంటే

By సుభాష్  Published on  29 Oct 2020 12:03 PM GMT
అభినందన్‌ పట్టుబడిన సమయంలో పాక్‌ చీఫ్‌ జనరల్‌ గజగజ వణికిపోయారట.. ఎందుకంటే

పాకిస్థాన్‌ వైమానిక పోరులో శతృవులను సైతం తరిమికొట్టిన భారతీయ వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ విషయంలో పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జాదేవ్‌ బాజ్వా వణికిపోయారట. ఈ విషయాన్ని ఆ దేశ పార్లమెంట్‌ సభ్యుడు ఒకరు స్వయంగా వెల్లడించారు. యుద్ద విమానం కూలిపోవడంతో పాక్‌కు చిక్కిన అభినందన్‌ను విడిచిపెట్టకపోతే భారత్‌ తమపై దాడి చేయనుందని అప్పటి ఓ సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రి మహమ్మద్‌ వెల్లడించినట్లు తెలుస్తోంది.

2019 ఫిబ్రవరి నాటి సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సైతం తిరస్కరించారు. ఈలోగా పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బాజ్వా సమావేశం జరుగుతున్న గదిలోకి వచ్చారు. అప్పుడు ఆయన కాళ్లు వణుకుతున్నాయి. శరీరమంతా చెమటలు పట్టిపోయాయి. చర్చల అనంతరం పాక్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మహమ్మద్‌ ఖురేషి మీకు పుణ్యముంటుంది అభినందన్‌ను విడుదల చేయండి. లేదంటే భారత్‌ రాత్రి 9 గంటలకు మన మీద దాడి చేసేందుకు సిద్ధమవుతోంది అన్నారు అని గతేడాది ఫిబ్రవరిలో భారత వైమానిక దళ పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ విడిచిపెట్టినప్పటి పరిస్థితులపై పాకిస్థాన్‌ పార్లమెంట్‌ నేషనల్‌ అసెంబ్లీలో పాక్‌ ముస్లిం లీగ్‌-ఎన్‌ నాయకుడు అయాజ్‌ సాధిక్‌ మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారని ఏఎన్‌ఐ వార్త సంస్థ పేర్కొంది. దీంతో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అభినందన్‌ను వెంటనే విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వెల్లడించారట.

ఆ రోజు రాత్రి పీపీపీ, పీఎంఎల్‌ ఎన్‌ సహా పార్లమెంటరీ పార్టీ నాయకులతో మహ్మద్‌ ఖురేషీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అభినందన్‌ను విడిచిపెట్టకపోతే ఆ రోజు రాత్రి 9 గంటలకు పాక్‌పై భారత్‌ దాడి చేస్తుందని అయాజ్‌ వివరించినట్లు వార్త సంస్థ తెలిపింది. ఆ సమావేశానికి ఇమ్రాన్‌ ఖాన్‌ రాలేదు. అయితే గదిలోకి వచ్చేటప్పుడు సైన్యాధిపతి జనరల్‌ బాజ్వా పరిస్థితి నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన కాళ్లు వణికాయి. ఒళ్లంతా చెమటలు కనిపించాయి. ఆ తర్వాత అభినందన్‌ను వదిలిపెట్టేద్దామని ఖురేషి అన్నారు. లేకపోతే ఆ రోజు దాడి జరిగేది అని సాధిక్‌ చెప్పారు.

కాగా, జమ్మూలోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ సిబ్బందిపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పాక్‌కు చెందిన జైష్‌-ఎ-మహ్మద్‌ తీవ్రవాద స్థావరంపై భారత్‌ వాయుసేన విరుచుకుపడింది. గత ఏడాది ఫిబ్రవరి 27న కశ్మీర్‌లో పాక్‌ విమానం చొరబాటును అడ్డుకోవడంతో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ తన ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోరులో ఎఫ్-16 యుద్ధ విమానాన్ని తన మిగ్‌-21 విమానంతో వెంటాడి మరీ కూల్చివేశారు. ఈ క్రమంలో విమానం కూలిపోవడంతో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ కిందికి దిగాల్సి వచ్చింది. అది పాక్‌ భూభాగం కావడంతో పాక్‌ సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుంది. ఇరుదేశాల చర్చల అనంతరం 2019, మార్చి 1న అభినందన్‌ను వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించారు. ఆయన ధైర్య సాహసానికి గాను భారత ప్రభుత్వం అభినందన్‌ను వీర చక్ర పతకంతో సత్కరించింది.Next Story