తిరుమలలో చిరుతల సంచారం.. భయాందోళనలో స్థానికులు

By అంజి  Published on  24 March 2020 12:36 PM GMT
తిరుమలలో చిరుతల సంచారం.. భయాందోళనలో స్థానికులు

తిరుపతి: కరోనా వైరస్‌ వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల దర్శనాలను టీటీడీ నిలిపివేసింది. దీంతో తిరుమల కొండలు జన సంచారం లేకపోవడంతో పూర్తిగా నిర్మానుష్యమయ్యాయి. కేవలం టీటీడీ ఉద్యోగులు, కొందరు స్థానికులు మినహా ఎవరూ కూడా తిరుమలలో లేరు. శ్రీవారి ఆలయ ప్రాంగణం, ఘాట్‌ రోడ్లు అన్ని వెల వెల బోయాయి. జన సంచారం లేకపోవడంతో అడవి జంతువులు స్వేచ్ఛగా శ్రీవారి ఆలయ ప్రాంగణంలో సంచరిస్తున్నట్లు కనిపిస్తోందని.. వార్త సంస్థ బీబీసీ తెలుగు తెలిపింది. తిరుమలలో ఇప్పటికే చిరుత పులుల సంచారానికి సంబంధించిన ఆన వాళ్లు కనిపించాయని టీటీడీ ఫారెస్ట్‌ అధికారులు చెబుతున్నారని బీబీసీ చెప్పింది. అడవి జంతువులు.. జనావాసాల్లోకి రావడంతో స్థానికులకు అధికారులు తగిన జాగ్రత్తలు సూచిస్తున్నారు.

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థాన పరిధిలో 2,280 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. 25 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ అడవి విస్తరించి ఉంది. ఇందులో అనేక రకాల జంతువులు ఉన్నాయి. ముఖ్యంగా చిరుతలు, ఎలుగుబంట్లు, ఏనుగులు, పునుగు పిల్లులు, ముళ్లపందులు, జింకలు వంటివి ఉన్నాయి.

ప్రతి సంవత్సరం మే నెలలోనే అడవి నుంచి జంతువులు బయటకు వచ్చిన ఘటనలు నమోదు అవుతున్నాయని టీటీడీ ఫారెస్ట్ రేంజర్‌ శివ కుమార్‌ మాకు చెప్పారని బీబీసీ తెలుగు చెప్పింది. అయితే కరోనా నేపథ్యంలో తిరుమలకు భక్తులు రాకపోవడంతో వాహనాల శబ్దాలు లేవని.. ఇది జంతువులకు అవకాశంగా మారిందన్నారు. రాత్రి సమయంలో చిరుతలు, ఎలుగుబంట్లు బయటకు వస్తున్నట్లు సమాచారం ఉందన చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే విజిలెన్స్‌ అధికారులు అప్రమత్తమయ్యారని తెలిపారు. ప్రస్తుతం తిరుమల కొండల్లో జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అలిపిరి సమీపంలోని స్ధానికులు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

"ఎండాకాలంలో ముఖ్యంగా తాగునీటి కోసం కొన్ని జంతువులు రోడ్డు మీదకు వస్తూ ఉంటాయి. కొన్ని సార్లు ముల్లగుంట, కల్యాణ వేదిక వంటి పరిసరాల్లో జంతువులు కనిపిస్తాయి. దానికి తగ్గట్టుగా కాలినడకన వెళ్ళే భక్తులకు రక్షణ నిమిత్తం జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాం." అంటూ టీటీడీ సహాయక పౌర సంబంధాల అధికారిణి నీలిమ చెప్పారు.

Next Story
Share it