2019లో ప్రమాదాల్లో 83 చిరుతల మరణం

By రాణి  Published on  2 Jan 2020 10:55 AM GMT
2019లో ప్రమాదాల్లో 83 చిరుతల మరణం

ముఖ్యాంశాలు

  • రోడ్డు, రైలు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పుతున్న చిరుతలు
  • పెరుగుతున్న పట్టణీకరణవల్ల తరిగిపోతున్న అడవులు
  • జనావాస ప్రాంతాలకు దగ్గరగా సంచరిస్తున్న చిరుతపులులు
  • మొత్తం దశాబ్దంలోకెల్లా 2019లో అత్యధిక చిరుతల మరణాలు

దేశంలో రోడ్డు, రైలు ప్రమాదాల్లో మరణిస్తున్న చిరుత పులుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. 2019 సంవత్సరంలో మొత్తంగా దశాబ్దంలోకెల్లా ఎక్కువగా 83 చిరుతపులులు ఇలా ప్రమాదాల కారణంగా మరణించాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ వివరాలను తెలిపింది. మొత్తంగా 2019లో ప్రమాదాల్లో చనిపోయిన చిరుతల్లో 73 కేవలం రోడ్డు ప్రమాదాల్లో చనిపోయాయి. మరో పది రైలు పట్టాలను దాటుతుండగా ప్రమాదం సంభవించి ప్రాణాలు కోల్పోయాయి. తెలంగాణ అటవీ శాఖ అందించిన వివరాలను బట్టి రాష్ట్రంలో ఐదు చిరుతలు ఈ విధంగా ప్రమాదాల్లో ప్రాణాలను కోల్పోయాయి. వీటిలో రెండు రోడ్డు ప్రమాదాల్లో, మరో రెండు రైలు ప్రమాదాల కారణంగా చనిపోయాయి.

2010 నుంచి 2019 వరకూ అధికారిక లెక్కల్ని పరిశీలిస్తే పదేళ్లలో ప్రమాదాల్లో మరణించిన చిరుతల సంఖ్య 278 శాతం పెరిగింది. 2018లో 80 చిరుతలు ఈ విధంగా ప్రాణాలు కోల్పోగా 2019లో మరో మూడు చిరుతల మరణాలు అదనంగా ఈ జాబితాలో చేరాయి. అంటే గడచిన సంవత్సరం మొత్తం 83 చిరుతలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయాయన్నమాట. 2017లో మాత్రం 63 చిరుతలే యాక్సిడెంట్ల కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నాయి. అటవీ ప్రాంతాల విస్తృతి తగ్గిపోవడంవల్ల చిరుతలు మానవ ఆవాసాలకు దగ్గరగా తిరుగాడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా అవి రోడ్లమీదకు, రైల్వే ట్రాకుల మీదికి వచ్చినప్పుడు అత్యధికశాతం ఇలా వచ్చిన చిరుతలు ప్రాణాలు కోల్పోతున్నాయి. మహారాష్ట్రలో 22, ఉత్తరాఖండ్ లో 11, రాజస్థాన్ లో 10, మధ్యప్రదేశ్ లో 9, కర్నాటకలో 7, గుజరాత్ లో 5 చిరుత పులులు గడచిన సంవత్సరం ఇలా ప్రమాదాల కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నాయి.

అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న రోడ్డు, రైలుమార్గాల్లో యానిమల్ క్రాసింగులను ఏర్పాటు చేయడం, వేగాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించడం, రోడ్డుమార్గాలకు, రైలు మార్గాలకు ఇరువైపులా రక్షణ కంచెల్ని ఏర్పాటు చేయడం, పట్టణీకరణకోసం అడవులను నాశనం చేయకుండా ఉండడం లాంటి చర్యలు పటిష్ఠంగా తీసుకుంటే తప్ప చిరుతపులుల ప్రమాద మరణాలను ఆపడం సాధ్యం కాదని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా అభిప్రాయపడుతోంది.

Next Story