పేరు మార్పు 'ఆధారం' లేకుండా చేసింది..!
By సత్య ప్రియ Published on 4 Nov 2019 7:57 AM GMTఒక్క పేరు తప్పు పడితే ఏమి అవుతుంది?? పెద్ద తేడాలు ఏమి జరిగిపోతాయి. అని అనుకుంటాం... కానీ పేరు తప్పు పడడం వల్ల ఒక మహిళ అంత్యక్రియలే ఆగిపోయాయి.
హైదరాబాద్ లో రుక్కమ్మ అనే మహిళ పేరు సుకమ్మ అని పడడం వల్ల, ఆమె అంత్యక్రియలు ఆగిపోయాయి. గత రెండు రోజులుగా, ఆమె పార్ధివ దేహం ఉస్మానియా ఆసుపత్రి మార్చరీలో పడి ఉంది.
మూత్రపిండ సమస్య కారణంగా, 65 ఏళ్ల రుక్కమ్మ ను ఉస్మానియా ఆసుపత్రి లో చేర్చారు. నెల రోజుల పాటు వైద్యం జరిగిన తరువాత అనాధ అయిన ఆమె అక్టోబర్ 31న మరణించింది.
సెకండ్ చాన్స్ ట్రస్ట్, అనే స్వచ్చంద సంస్థవారు, ఆమెను చాదర్ ఘాట్ రోడ్డు పై పడి ఉండగా గుర్తించి ఆదుకున్నారు. అక్కడ, ఆమె వచ్చేపోయే వారు ఇచ్చింది తింటూ బ్రతికింది. ఇంటి నుంచి ఎవరూ రాకపోయే సరికి ఆమె 5 రోజుల పాటు రోడ్డు మీదే ఉండిపోయింది. స్థానికులు ఎస్.సి.టి కి కబురు చేయగా, ఆమెను వృద్ధాశ్రమానికి తరలించారు.
ఆమె కు స్నేహితులు, బంధువులు లేని కారణంగా, ఎస్ సి టి అనే స్వచ్చంద సంస్థ వారు, ఆమె అంత్యక్రియలు జరిపేందుకు ముందుకు వచ్చారు. "ఆమెను ఆదుకునే సమయంలో, పేరు సుకమ్మ గా రాసుకున్నం. ఆమె సరిగా మాట్లాడలేని పరిస్థితి లో ఉండడం వల్ల ఈ పొరపాటు జరిగింది. వృద్ధాశ్రమంలో కొద్ది రోజులు ఉన్న తరువాత ఆమె ఆధార్ కార్డు ఇచ్చింది. అందులో, ఆమె పేరు మలక్ పెట్ కు చెందిన రుక్కమ్మ గా ఉంది. 30 వేలు తీసుకొని తనను రోడ్డుపైన వదిలివెళ్లిన, తన కొడుకు వద్దకు వెళ్లడానికి ఆమె నిరాకరించింది" అని ఎస్.సి.టి కార్యకర్తలు చెప్తున్నారు.
ఉస్మానియా ఆసుపత్రి లో చేర్చేటప్పుడు అధికారులు ఆధార్ కార్డు వివరాలను తీసుకున్నారు. అయితే, నెలరోజుల తరువాత, ఆమె మరణించగా లీగల్ కేసు కావడం వల్ల పోస్ట్ మార్టం తప్పనిసరి అయ్యింది. ఆధార్ కార్డు, ఎస్.సి.టి లో చేర్చుకున్నప్పటి పత్రాలలో పేర్లు వేరు వేరుగా ఉండటంవల్ల ఆటాప్సి శాఖ వారు అభ్యంతరాలు లేవనెత్తారు. పేర్లల్లో తేడాలు ఉన్న కారణంగా, శరీరాన్ని ఎస్.సి.టి కి అప్పగించలేమని, రేపు, ఆమె బంధువులు వచ్చి అడిగితే సమస్యలు తలెత్తుతాయని ఆసుపత్రి అధికారులు చెప్తున్నారు.
అయితే, ఇన్నిరోజులు రాని బంధువులు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారని స్వచ్చంద సంస్థ కార్యకర్తలు వాపోతున్నారు.