కష్టాల కడలిని దాటిన విశాఖ ఏజెన్సీ లంక తమిళ శరణార్థులు

By Newsmeter.Network  Published on  6 Dec 2019 2:09 PM GMT
కష్టాల కడలిని దాటిన విశాఖ ఏజెన్సీ లంక తమిళ శరణార్థులు

  • ఉన్నంతలో సుఖంగా బతుకుతున్నామంటున్న తమిళ శరణార్థులు
  • స్థానిక గుర్తింపు లభించిన తర్వాత మారిన జీవితాలు
  • తింటానికీ, ఉండడానికీ ఉంటే చాలని సంతృప్తి

ఉన్నఊరును, నమ్ముకున్న నేలను ఉన్నపళంగా వదిలిపెట్టాల్సి వచ్చింది. అనునిత్యం యుద్ధవాతావరణంలో బతికే అవకాశం లేక పొట్ట చేతబట్టుకుని శ్రీలంకనుంచి భారత దేశానికి తరలివచ్చారు. కూడూగుడ్డా లాంటి కనీస సౌకర్యాలకు నోచుకోవడానికి, స్థానిక గుర్తింపును పొందడానికీ వారికి నాలుగు దశాబ్దాలకుపైగా పట్టింది. ఒక దశలో వెనక్కి తిరిగి వెళ్లిపోదామనుకున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడే బాగుందని చెబుతున్నారు. విశాఖ ఏజెన్సీకి నాడు తరలివచ్చిన శరణార్ధుల జీవిత చిత్రాన్ని ప్రతిబింబించే కథనం గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు.

ఉత్తర శ్రీలంకలో తమిళుల అభ్యున్నతికి లోటేం లేదంటూ శ్రీలంక అధ్యక్షుడు గోతేభ్య రాజపక్సే హామీలమీద హామీలు గుప్పిస్తూనే ఉన్నారు. కానీ లంకనుంచి ఎల్.టి.టి.ఈ నుంచి ఎదురైన తీవ్ర ఒత్తిడిని తప్పించుకునేందుకు పారిపోయి శరణార్థులుగా ఇతర దేశాలకు వచ్చిన తమిళుల సంగతిమాత్రం ఆ దేశ నేతలకు, రాజకీయ వర్గాలకు పట్టడం లేదు.

జాఫ్నానుంచి తెలుగు నేలకు శరణార్ధులుగా వలసవచ్చిన పలు తమిళ దళిత కుటుంబాలు ఇప్పటికీ ఇక్కడే ఉండిపోయాయి. నిజానికి వారంతా ఇక్కడే స్థిరపడ్డారనికూడా చెప్పుకోవచ్చు. అప్పట్లో అలా తరలివచ్చిన వేలాది కుటుంబాల్లో ఒక కుటుంబం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని లంబిసింగి సమీపంలో ఉన్న ఆర్వీ నగర్ లో సంతోషంగా జీవిస్తోంది. ఉన్నంతలో పొట్ట పోసుకోవడానికి దరిదాపుల్లో ఉన్న మార్గాలను అన్వేషిస్తూ, కాయకష్టం చేసుకుని జీవిస్తున్న ఈ కుటుంబాలు నిత్యం యుద్ధాన్ని తలపించే వాతావరణం నుంచి బయటపడి బతికి బట్టకట్టినందుకు సంతోషిస్తున్నాయి.

అలా జయవర్ధనే హయాంలో తమిళ సైన్యం పడవల్లో తరలించుకొచ్చిన కొన్ని కుటుంబాలు తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్థిరపడ్డాయి. ఇలా శరణార్థులుగా తరలివచ్చిన వారిలో ఎక్కువమంది దళితులే. అప్పట్లో పదేళ్ల పిల్లాడిగా తన తల్లిదండ్రులతో తెలుగు నేలమీదికి వచ్చేసిన రామస్వామి కరుణానిధి అనే వ్యక్తికి ఇప్పుడు నలభై తొమ్మదేళ్లు వచ్చాయి.

తన నలభై తొమ్మిదవ పుట్టిన రోజు వేడుకలు జరుపుకునే తరుణంలో రామస్వామి కరుణానిధి గత కాలపు బాధాకరమైన స్మృతుల్ని నెమరేసుకున్నాడు. పిల్లాపాపలతో కనీసం సాధారణ స్థాయి జీవితాన్ని సంతోషంగా గడపగలుగుతున్న తను శ్రీలంకలో ఆనాడు పడిన బాధల్ని, కష్టాల్ని, భయాన్ని గురించి పూసగుచ్చినట్టు చెప్పాడు. వాళ్ల కుటుంబం 1981లో ఇక్కడికి వలస వచ్చింది.

శ్రీలంకలో ఎల్ టీటీఈకీ అక్కడి ప్రభుత్వానికీ మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం జరుగుతున్న సమయంలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆ పరిస్థితుల మధ్య నలిగిపోతున్న కొన్ని నిరుపేద తమిళ కుటుంబాలకు ఆసరా ఇవ్వాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం కారణంగానే వందలాది తమిళ కుటుంబాలు తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తరలిరాగలిగాయి.

అప్పట్లో లంబిసింగి దగ్గరున్న అర్వీ నగర్ కి అలా నలభై తమిళ దళిత కుటుంబాలు శరణార్ధులుగా వలసవచ్చాయి. ఈ గ్రామం విశాఖపట్నానికి దరిదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అప్పట్లో వాళ్లకు ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కి చెందిన శిధిలమైన క్వార్టర్లను ఉండడానికి ఇచ్చారు. అక్కడ ఉన్న కాఫీ తోటల్లో పెద్దవాళ్లకు పని దొరికింది. కానీ సంవత్సరంలో నాలుగు నెలలపాటు మాత్రమే అదీ ఉంటుంది. మిగతా సమయంలో పొట్టకూటికోసం వాళ్లంతా ఏదో ఒక కూలోనాలో వెతుక్కోక తప్పేది కాదు.

కొన్ని క్రైస్తవ సేవాసంస్థలు శరణార్థుల పిల్లలకు బట్టలు, తినడానికి తిండి ఇచ్చి ఆదుకున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న ఏకైక ఇంగ్లిష్ మీడియం స్కూల్ అయిన శాంతి సాధన హైస్కూల్లో అడ్మిషన్లు ఇప్పించాయి. ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులకూ శరణార్ధులకూ మధ్య ఎలాంటి సంబంధాలూ ఉండేవి కావు. పైగా స్థానికుల నుంచి ఏ విధంగానూ ఏమాత్రం సాయం లభించేదికూడా కాదు.

ఆ దశలో తీవ్రస్థాయిలో వేళ్లూనుకున్న నక్సలిజం ప్రభావం వీరిపై ఎక్కువగా పడడం మొదలయ్యింది. శ్రీలంకలో బాధల్ని తప్పించుకునేందుకు ప్రాణాలు నిలబెట్టుకునేందుకు ఇక్కడికి వచ్చిన వారికి ఇక్కడ కూడా అలాంటి సమస్య తప్పలేదు. ఒకవైపు నక్సల్స్ తమ వివరాలను, అనుపానాలను పోలీసులకు చెప్పడానికి వీల్లేదని బెదిరించేవాళ్లు. చెప్పకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని గ్రేహౌండ్స్ పోలీసులు కాల్చుకుతినేవాళ్లు. కరమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకుకోపం అన్నట్టుండేది వాళ్ల పరిస్థితి.

ఈ బాధలు పడలేక తిరిగి తమను శ్రీలంకకైనా పంపమని లేదా తమిళనాడులోని సేలం ప్రాంతానికైనా తరలించమని శరణార్థుల కుటుంబాలు ప్రభుత్వానికి ఎన్నో విన్నపాలు చేసుకున్నాయి. కానీ అవన్నీ పూర్తిగా బుట్టదాఖలయ్యాయి తప్ప, వాళ్లను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. పాడేరు ప్రాంతానికి సబ్ కలెక్టర్ గా వచ్చిన తమిళుడు ఎస్.సాల్మన్ ఆరోగ్య రాజ్ వాళ్ల జీవితాల్లో కొత్త వెలుగు రేఖలు నింపారు. శరణార్థులందరినీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కేటగిరీలో చేర్చి వాళ్లందరికీ ఆది ద్రవిడ కుల ధ్రువీకరణ పత్రాలను అందజేశారాయన. ప్రస్తుతం ఆయన ఎపి.ఎమ్.ఎస్.ఎస్ కి సీఈఓగా పనిచేస్తున్నారు.

ఎపి.ఎఫ్.డి.సి క్వార్టర్లలో ఉండడానికి నీడ దొరికాక సాల్మన్ ఆరోగ్య రాజ్ చేసిన సాయంతో వారంతా స్థానికులుగా పరిగణనలోకి వచ్చేశారు. ఆ తర్వాత కొంత కాలానికి వీరందరికీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడెంటిటీ కార్డులు కూడా మంజూరయ్యాయి. దాంతో వాళ్లకు మిగతా జీవితాన్ని ఇదే గ్రామంలో గడపగలుగుతామన్న భరోసా కలిగిందని లంకలో తీవ్రస్థాయిలో ఇబ్బందులు చవిచూసిన, అక్కడినుంచి ఇక్కడకు వలసవచ్చిన మహిళ, నేడు 70 సంవత్సరాల వృద్ధురాలు రసమ్మ చెబుతున్నారు. ఈమె కరుణానిధి తల్లి. ఈ కుటుంబానికి పెద్ద.

ప్రస్తుతం ప్రభుత్వనుంచి, ప్రైవేటు వ్యక్తులనుంచీ ఏ విధమైన సాయం లేకపోయినా తమ కుటుంబాలు కనీస వసతులతో సుఖంగా జీవించగలుగుతున్నాయని ఆమె అంటున్నారు. 2004లో ఇదే కుటుంబాల పెద్దలను కదిలించినప్పుడు తాము తిరిగి జాఫ్నాకి లేదా తమిళనాడులోని సేలం ప్రాంతానికి వెళ్లిపోదామనుకుంటున్నామనే మాట గట్టిగా వినిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితిలో పూర్తి స్థాయి మార్పు వచ్చింది.

నాలుగు శతాబ్దాలుగా ఈ కుటుంబాలు సర్వస్వాన్నీ వదులుకుని కట్టుబట్టులతో ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్న కారణంగా తమ స్వస్థానాల్లో ఉన్న ఇళ్ల స్థలాలు, పొలాలు, ఆస్తులు అన్నింటినీ పూర్తిగా పోగొట్టుకున్నారు. వీళ్లంతా ఇక్కడికి వచ్చేసిన తర్వాత వీళ్ల ఆస్తులు అన్యాక్రాంతమైపోయాయి.

ఇకపైకూడా విశాఖ మన్యమే తమకు శాశ్వత ఆవాసమని, తాము ఇక్కడే సుఖంగా సంతోషంగా జీవించగలుగుతున్నామనీ, వెనక్కి తిరిగి వెళ్లాల్సిన అవసరమే లేదని కరుణానిధి చెల్లెలు 33 సంవత్సరాల వయసున్న తబాధి వీరాస్వామి చెబుతోంది. ప్రస్తుతం ఆమె వైద్య ఆరోగ్య శాఖలో ఆయాగా పనిచేస్తోంది. గీతమ్ డీమ్డ్ యూనివర్సిటీలో ఆంత్రోపాలజీలో పి.జి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్న ఏకైక మహిళగా ఈ కుటుంబాల్లో ఈమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈమె స్థానిక గిరిజనుడిని వివాహం చేసుకుంది.

తమకు తమ పిల్లలకు అత్యున్నత స్థాయి ఉద్యోగాలు సంపాదించుకోవాలన్న కోరిక లేదని, చిన్నస్థాయివైనా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకుని కనీసం కింది స్థాయి మధ్యతరగతి కుటుంబాలుగా మనగలిగే పరిస్థితి ఉంటే చాలని, తమ పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులైతే చాలని తాము భావిస్తున్నామని చెబుతోందీ మహిళ.

Next Story