పురపోరులో తిరుగులేని విజయం టీఆర్ఎస్ సొంతం

By రాణి  Published on  25 Jan 2020 12:08 PM GMT
పురపోరులో తిరుగులేని విజయం టీఆర్ఎస్ సొంతం

ముఖ్యాంశాలు

  • ప్రజలు, మీడియాకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్

తెలంగాణ రాష్ర్ట పురపాలక ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన విజయం...రాష్ర్ట ప్రజల విషయమన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుంధుభి మోగించిన సందర్భంగా కేటీఆర్ తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. ముందుగా పార్టీకి ఘన విజయాన్నందించిన రాష్ర్ట ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, సోషల్ మీడియా వారియర్స్ ఇలా పురపోరులో టీఆర్ఎస్ విజయానికి కృషి చేసిన వారందరికీ కేటీఆర్ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీకున్న 60 లక్షల సభ్యుల కృషి వల్లే టీఆర్ఎస్ ఇంత ఘన విజయాన్ని సాధించగలిగిందన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించడంతో పాటు, ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టిన సోషల్ మీడియా సైనికులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ పోరులో కూడా టీఆర్ఎస్ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు.

ఐదేళ్లుగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ర్టంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు దక్కిన ప్రజల ఆమోదమే ఈ కార్పొరేట్ విజయమని పేర్కొన్నారు కేటీఆర్. ఒక్క మున్సిపల్ ఎన్నికల్లోనే కాకుండా సార్వత్రిక, పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజలు టీఆర్ఎస్ కే పట్టం కట్టారన్నారు. ప్రతిపక్షాలు చేసిన అసత్య ప్రచారాలను ప్రజలు పక్కకు నెట్టి ప్రభుత్వం పై నమ్మకంతో మళ్లీ గెలిపించడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు చూశాక...ప్రతిపక్షాలకు తమ పరిస్థితి ఏంటో అర్థమయ్యే ఉంటుందని, ఇకనైనా ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని ఆశిస్తున్నానన్నారు. రానున్న నాలుగేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో పూర్తిగా రాష్ర్ట పాలనపైనే దృష్టి పెడతామని తెలిపారు కేటీఆర్. ప్రజాసంక్షేమానికి, అభివృద్ధికి పునరంకితం అవుతామన్నారు.

Next Story