ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య..!
By సుభాష్
కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి కన్న బిడ్డలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జిల్లాలోని కొండపల్లిలో తీవ్ర కలకలం రేపింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి.. అనంతరం తానూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొండపల్లికి చెందిన లావణ్య-నాగేశ్వరరావుకు మూడేళ్ల కుమార్తె, ఏడాది పాప ఉంది.
అయితే ఇంటి నుంచి లావణ్య బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇంటికెళ్లి చూడగా, తల్లి, ఇద్దరు పిల్లలను గుర్తించారు. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి వారిని రక్షించేందుకు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వారిని ఆస్పత్రిలో చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరించినట్లు సమాచారం. మరో ఆస్పత్రికి తరలిస్తుండగా, ముగ్గురు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, భర్త నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.