బొప్పాయి కోసం పండ్ల మార్కెట్ లో ఉద్రిక్తత...!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Sep 2019 2:31 PM GMT
బొప్పాయి కోసం పండ్ల మార్కెట్ లో ఉద్రిక్తత...!!

హైదరాబాద్ : డెంగ్యూ జ్వరం నగరంలో విజృంభిస్తోంది. డెంగీ అటాక్‌తో తలెత్తే ప్లేట్లెట్ల సమస్యను సమర్థంగా ఎదుర్కొంటే.. ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. బొప్పాయి, దానిమ్మ పండ్లను ఆహారంగా తీసుకుంటే ప్లేట్లెట్ల వృద్ధికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బొప్పాయికి భారీ గిరాకి ఏర్పడింది. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.100 పైగా పలుకుతోంది.

మరో వైపు బొప్పాయి పంట తగినంత అందుబాటులో లేదు. పండ్ల వ్యాపారులు బొప్పాయి కోసం పోటీపడుతున్నారు. ఈ క్రమంలో బొప్పాయి రైతులపై దళారులు దాడికి పాల్పడ్డారు. దీంతో .. కొత్తపేట ఫ్రూట్‌ మార్కెట్‌లో ఉద్రిక్తత నెలకొంది. చెమటోడ్చి పండించిన పంటకు దళారులు తక్కువ మొత్తంలో చెల్లించి.. బయట భారీ మొత్తానికి అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

పండ్లను తమకు అమ్మకుండా నేరుగా రైతులు మార్కెట్‌కు తరలించడంపై దళారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళారులు రైతులపై దాడికి దిగి దుర్భాషలాడారు. బొప్పాయి పండ్లు తమకే అమ్మాలని దళారులు డిమాండ్ చేశారు. పరస్పరం దాడులతో పండ్ల మార్కెట్‌ దద్దరిల్లింది. పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు.

Next Story