కొరటాల V/s రైటర్.. లాజిక్ మిస్సవుతున్నారే
By సుభాష్ Published on 29 Aug 2020 9:16 AM ISTఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్న వ్యవహారం ఆచార్య సినిమా కాపీ ఆరోపణల గురించే. దర్శకుడు కావాలని ఆశిస్తున్న రాజేష్ మండూరి అనే రైటర్ తన కథను కాపీ కొట్టే కొరటాల శివ ఆచార్య సినిమా తీస్తున్నాడని ఆరోపణలు చేశాడు. ఈ వ్యవహారం మీడియాకు ఎక్కి రచ్చ రచ్చ అవుతోంది. వ్యవహారం ఇంత వరకు రాకుండా ఇండస్ట్రీ ప్రముఖులు ఎందుకు పరిష్కరించలేకపోయారన్నది అర్థం కాని విషయం.
తాను పరుచూరి గోపాలకృష్ణ, ఎన్.శంకర్ సహా చాలామందిని కలిసి తన బాధ చెప్పుకున్నానని.. ఎవరూ తనకు న్యాయం చేయలేకపోయారని అంటున్నాడు రాజేష్. కొరటాల ఈ ఆరోపణలు ఎదుర్కోవడాన్నే అవమానంగా భావిస్తున్నట్లు ఆగ్రహంతో మాట్లాడుతున్నారు. ఇరువురూ ఓ టీవీ ఛానెల్ చర్చలో ఎవరి వెర్షన్ వాళ్లు వినిపించారు. ఐతే ఇద్దరూ ఒక్కో పాయింట్ దగ్గర లాజిక్ మిస్సవుతున్న సంగతి స్పష్టంగా తెలుస్తోంది.
తాను తీస్తున్నది రాజేష్ కథ కానే కాదని కొరటాల అంటున్నారు. ఐతే రచయితల సంఘం వివరణ అడిగినపుడు ఆయన తన కథ చెప్పడానికి ఆసక్తి చూపించలేదన్నది రాజేష్ చెబుతున్న మాట. ఎవరో అనామకుడు వచ్చి ఆరోపణ చేస్తే తాను తన కథ చెప్పాలా అన్నది ఆయన వెర్షన్ కావచ్చు. తన స్థాయికి వివరణ ఇవ్వడం తగదని ఆయన భావిస్తున్నట్లున్నారు. ఐతే వివాదం పెద్దదవుతున్న నేపథ్యంలో కొరటాల రచయితల సంఘం పెద్దలైన పరుచూరి లాంటి వాళ్లకు కథ ఇచ్చి, రాజేష్ కథతో తనది పోల్చి చూడమని చెబితే.. పోలికలు లేనట్లయితే వ్యవహారం అక్కడితో ముగిసిపోతుంది. కానీ ఆయన ఆ పని చేయట్లేదు.
ఇక రాజేష్ విషయానికి వస్తే.. ఎవరో కో డైరెక్టర్ చెప్పాడు కొరటాల తీస్తున్నది తన కథే అని అనే వాదనతో ఇంత గొడవా చేస్తున్నాడు. ఐతే ఆచార్య కథ వేరు అని స్వయంగా కొరటాలే చెబుతున్నాడు. నీ కథతో శుభ్రంగా నువ్వు సినిమా తీసుకో అంటున్నాడు. రేప్పొద్దున సినిమా చూసి మాట్లాడు అంటున్నాడు. అతనంత ధీమాగా చెబుతున్నపుడు రాజేష్‌కు ఉన్న ఇబ్బందేంటో? తన కథ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నపుడు రేప్పొద్దున సినిమా రిలీజయ్యాక అది కాపీ అయితే రుజువు చేయడం కష్టమేమీ కాదు. కానీ అతను కూడా కోడైరెక్టర్ చెప్పాడనే ఒకే మాట పట్టుకుని వ్యవహారాన్ని పెద్దది చేస్తుండటమే విడ్డూరం.