వైకల్యంపై విజయం.. పేరు కొప్పుల వసుంధర

By Newsmeter.Network  Published on  14 Jan 2020 9:30 PM IST
వైకల్యంపై విజయం.. పేరు కొప్పుల వసుంధర

వైకల్యం శరీరానికి కాదు. మనసు ఓడిపోయినప్పుడే మనకు వైకల్యం వస్తుంది. మనసు ఓటమిని అంగీకరించనంత వరకూ హిమాలయ పుటెత్తులను సాధించవచ్చు. సముద్రాలను శోధించవచ్చు. ఈ మాట కొప్పుల వసుంధరను చూస్తే అక్షరసత్యమనిపిస్తుంది.

ఐదేళ్ల వయసులో పోలియో కాళ్లను కట్టేసింది. పుల్లల్లా, బలహీనంగా ఉండే రెండు కాళ్లు...ఆమెను వీల్ చెయిర్ కి పరిమితం చేశాయి. కానీ ఊహలు మాత్రం ఆకాశాలను దూసుకుపోయాయి. సాఫల్యాన్ని చేరాలనుకున్న ఆమె దృఢసంకల్పాన్ని వైకల్యం ఆపలేకపోయింది. శారీరిక వైకల్యం వల్ల వచ్చే రిజర్వేషన్లను కాదని, సులువుగా దొరికే సర్కారీ కొలువును వద్దనుకుని ఆమె స్వావలంబనే ఆలంబనగా రెండుకాళ్లమీద నిలుచోవాలనుకుంది. వీవ్ ఇండియా పేరిట ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని ఏర్పాటు చేసి, తాను నిలవడమే కాకుండా ఎందరి బ్రతుకులనో నిలబెట్టింది.

అనంతపూర్ జిల్లా సెట్టూరుకు చెందిన 31 ఏళ్ల కొప్పుల వసుంధర ఆత్మవిశ్వాసం, స్వాభిమానం, నమ్మకం, నిజాయితీ అనే నాలుగుచక్రాల రథంపై గత ఆరేళ్లుగా తన ప్రయాణం కొనసాగిస్తోంది. మొదట స్క్రిప్ట్ రైటర్ గా ప్రారంభించి, తరువాత న్యూస్ యాంకర్ గా ఎదిగింది. నాలుగేళ్ల ప్రయాణం తరువాత తన సొంత ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ వీవ్ ఇండియాను ప్రారంభించింది. “శారీరిక వైకల్యం కన్నా ఆర్ధిక వైకల్యమే మనను కుంగదీస్తుంది. అందుకే ఆర్ధిక స్వావలంబన కోసం వీవ్ ఇండియాను స్థాపించాను” అంటారు వసుంధర. ఈ ప్రయాణంలో ఆమె వికలాంగుల టీ 20 క్రికెట్ టోర్నమెంట్ ను కూడా విజయవంతంగా నిర్వహించారు.

అంగవైకల్యం ఉందని కుంగిపోవడం కాదు. తనను తాను దివ్యాంగురాలిగా భావించుకుంటే ఎనలేని ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఈ భావంతోనే వసుంధర మిస్ ఎబిలిటీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైకల్యంపై విజయానికి నిలువెత్తు రూపం వసుంధర. శారీరిక వైకల్యాన్ని సవాలు చేసే విజయగాథ పేరు కొప్పుల వసుంధర!!

Next Story