తెలుగు తేజం ఖాతాలో మ‌రో టైటిల్‌.. రెండు నెల‌ల్లో రెండోది

By Newsmeter.Network  Published on  18 Feb 2020 5:27 AM GMT
తెలుగు తేజం ఖాతాలో మ‌రో టైటిల్‌.. రెండు నెల‌ల్లో రెండోది

తెలుగు తేజం.. చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి.. అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై స‌త్తాచాటుతోంది. గతేడాది డిసెంబర్‌ చివరి వారంలో ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌గా అవతరించిన హంపి.. తాజాగా కెయిర్న్స్ క‌ప్ టైటిల్‌ను కైవ‌సం చేసుకుంది. రెండు నెల‌ల్లో రెండు టైటిల్స్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. తొమ్మిదో రౌండ్ మ్యాచ్‌లో మ‌రో తెలుగు ప్లేయ‌ర్ ద్రోణ‌వ‌ళ్లి హారిక‌తో జ‌రిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. దీంతో ఆరు పాయింట్ల‌తో ఈ టోర్నీని కైవ‌సం చేసుకుంది.

నిజానికి ఆఖ‌రిదైన తొమ్మిదో రౌండ్‌లో కేవ‌లం డ్రా చేసుకుంటే చాలు టోర్నీని కైవ‌సం చేసుకుంటుంద‌నే స్థితిలో హంపి బ‌రిలోకి దిగింది. న‌ల్ల‌పావుల‌తో ఆడిన హంపి.. కేవ‌లం 29 ఎత్తుల్లో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఈ టోర్నీ విజ‌యం ద్వారా ఐదు ఎలో రేటింగ్ పాయింట్ల‌ను ద‌క్కించుకుంది. మ‌రోవైపు నాలుగున్న‌ర పాయింట్ల‌తో హారిక ఈ టోర్నీలో ఐదో స్థానం ద‌క్కించుకుంది.

ఇద్దరు మాజీ ప్రపంచ చాంపియన్స్‌ అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ (రష్యా), మరియా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌), ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ జూ వెన్‌జున్‌ (చైనా), ప్రపంచ బ్లిట్జ్‌ మాజీ చాంపియన్‌ కాటరీనా లాగ్నో (రష్యా), మూడుసార్లు యూరోపియన్‌ చాంపియన్‌ వాలెంటినా గునీనా (రష్యా)లాంటి అగ్రశ్రేణి క్రీడాకారిణులు పాల్గొన్న ఈ టోర్నీలో విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని హంపి తెలిపింది. తాజా విజయంతో త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌బోయే ప్ర‌పంచ ర్యాంకింగ్స్‌లో హంపి రెండోస్థానానికి ఎగ‌బాకే అవ‌కాశ‌ముంది. మ‌రోవైపు వ‌చ్చే మే నెల‌లో జ‌రిగే ఇట‌లీ గ్రాండ్‌ప్రి త‌న త‌దుప‌రి టార్గెట్ అని హంపి పేర్కొంది.

లక్షా 80 వేల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహించిన ఈ టోర్నీలో పాల్గొన్న పది మందికీ ప్రైజ్‌మనీ ఇచ్చారు. విజేతగా నిలిచిన హంపికి 45 వేల డాలర్లు (రూ. 32 లక్షల 10 వేలు).. రన్నరప్‌ జూ వెన్‌జున్‌కు 35 వేల డాలర్లు (రూ. 24 లక్షల 97 వేలు).. మూడో స్థానంలో నిలిచిన మరియా ముజిచుక్‌కు 25 వేల డాలర్లు (రూ. 17 లక్షల 83 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

Next Story
Share it