టీమిండియా కెప్టెన్‌, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి.. నిర్విరామంగా క్రికెట్‌ ఆడుతున్నాడు. బిజీ షెడ్యూల్‌ కారణంగా అలసిపోతున్నానని.. త్వరలో ఓ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలిపాడు. భారత్‌, కివీస్‌ జట్ల మధ్య శుక్రవారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విరాట్‌.. మీడియాతో మాట్లాడాడు. 2021లో జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత ఏదైనా ఒక ఫార్మాట్‌లో తప్పుకునే ఆలోచన ఏమైనా ఉందా..?’’ అని మీడియా సమావేశంలో ఓ జర్నలిస్ట్ కోహ్లిని ప్రశ్నించారు.

దానికి విరాట్ కోహ్లీ సమాధానమిస్తూ.. ‘నా ఆలోచనా ధోరణి విస్తృతంగా ఉంది. ఇప్పుడు నుంచి కఠినమైన మరో మూడేళ్ల వరకు ఆడటానికి నేను సన్నద్ధమవుతున్నాను. 2023 వరకూ అన్ని ఫార్మాట్లలోనూ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత ఒకసారి పునరాలోచించుకుంటాను. ఎందుకంటే.. గత ఎనిమిదేళ్లుగా ఏడాదిలో కనీసం 300 రోజులు క్రికెట్‌ కోసం కేటాయిస్తున్నాను. దీనిలో ఇందులో ప్రాక్టీస్, టీమ్ ప్రయాణాలు ఉన్నాయి. కాగా.. బిజీ షెడ్యూల్ కారణంగా మేము కూడా వ్యక్తిగతంగా కొంచెం విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాం. కానీ.. మూడు ఫార్మాట్లలో మ్యాచ్‌లు ఆడే క్రికెటర్లకి అది సాధ్యం కావడం లేదు. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించడం అంత సులువైన విషయం కాదు. ప్రాక్టీస్ సెషన్‌లో కూడా దీని ప్రభావం ఉంటుంది. అయితే విరామాలు తీసుకుంటూ వీటిని అధిగమిస్తున్నాను 2023 వన్డే ప్రపంచకప్ వరకూ అన్ని ఫార్మాట్లలో ఆడతాను. ఆ తర్వాత ఒక ఫార్మాట్ నుంచి తప్పుకోవడంపై ఆలోచిస్తానని’ అని కోహ్లీ చెప్పాడు.

2008లో అరగ్రేటం చేసిన కోహ్లీ ఇప్పటి వరకూ 248 వన్డేలు, 84 టెస్టులు, 81 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి 70 అంతర్జాతీయ శతకాలు బాదాడు. ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో కొనసాగుతున్నాడు. కానీ.. టీ20ల్లో మాత్రం ఈ భారత కెప్టెన్ ఇటీవల పదో స్థానానికి పడిపోయాడు.

కోహ్లి చెప్పిన దాని ప్రకారం.. మరో మూడేళ్ల వరకు అన్ని ఫార్మాట్లలో కోహ్లి క్రికెట్‌ ఆడనున్నాడు. ఆ తరువాత టీ20లకు గుడ్‌ బై చెప్పే అవకాశం ఉంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.