సచిన్ టెండూల్కర్.. క్రికెట్ ప్రపంచంలో ఆయనో దేవుడు.. ప్రత్యర్థి జట్లు కూడా సచిన్ ఆటను చూసి మంత్రముగ్ధులు అవ్వాల్సిందే..! బౌలర్లే మ్యాచ్ విన్నర్లు అనే దశాబ్దంలో క్రికెట్ లో అడుగుపెట్టిన సచిన్ .. టాప్ బౌలర్లందరికీ నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తూ ఓ ఎవరెస్టు శిఖరంగా ఎదిగాడు. ఆటతోనూ, తన నడవడికతోనూ అందరి మనసులను కొల్లగొట్టాడు. అటువంటి సచిన్ కూడా వరల్డ్ కప్ అందుకోడానికి ఎంతగానో ఎదురుచూశాడు. 2003 వరల్డ్ కప్ ను చివరి అంచెలో పోగొట్టుకున్న సచిన్.. 2011లో అందుకున్నాడు. అప్పుడు మాస్టర్ బ్లాస్టర్ భావోద్వేగానికి గురవ్వడం.. భారత ఆటగాళ్లు సచిన్ ను భుజాల మీద ఎత్తుకుని మోయడం.. క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరువలేడు.

భావోద్వేగంతోనూ.. సంతోషంతోనూ.. కూడుకున్న ఈ ఘటనకు ఓ అవార్డు లభించింది. ప్రతిష్ఠాత్మక లారెస్‌ స్పోర్ట్స్‌ మూమెంట్‌ 2000-2020 అవార్డును సచిన్ సొంతం చేసుకున్నారు. గత ఇరవై ఏళ్లలో క్రీడా చరిత్రలో మధురమైన ఘట్టాలకు సంబంధించి లారెస్‌ ఫౌండేషన్‌ పోటీ నిర్వహించింది. 19 మందితో పోటీప‌డిన స‌చిన్‌ అగ్ర‌స్థానంలో నిలిచి లారెస్‌ అవార్డును ద‌క్కించుకున్నారు. బెర్లిన్‌లో సోమవారం నాడు లారెస్ స్పోర్టింగ్ మూమెంట్ 2000-2020 అవార్డుల ప్రధానోత్సవంలో టెన్నిస్ లెజెండ్ బోరిస్ బెకర్ విజేతను ప్రకటించగా.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా టెండూల్కర్‌కు ట్రోఫీని అందజేశారు.

ట్రోఫీని అందుకున్న తర్వాత సచిన్ అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చాడో..! వరల్డ్ కప్ 28 సంవత్సరాల తర్వాత భారత్ అందుకోవడం తన కెరీర్ లో అద్భుతమైన విషయమని చెప్పాడు సచిన్. తాను ప్రపంచకప్ ను అందుకోడానికి ఎంతగా ఎదురుచూశానో.. ఏదైనా అనుకుంటే దాన్ని సాధించాక వచ్చే ఫీలింగ్ సచిన్ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అవి చాలా అద్భుతమైన క్ష‌ణాలని.. ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యాన్ని మాటల్లో వ‌ర్ణించ‌లేనని అన్నారు. అత్యంత అరుదుగా దేశం మొత్తం విజయోత్సవాలు చేసుకునే సంద‌ర్భ‌మ‌దని అన్నారు. నాకు ప‌దేళ్ల వ‌య‌సున్న‌ప్పుడు భార‌త్ తొలిసారి వ‌రల్డ్‌క‌ప్ (1983) సాధించిందని.. అప్పుడు తనకు ఆ విష‌యం గురించి స‌రైన అవ‌గాహ‌న లేకున్నా అంద‌రితోపాటే సెల‌బ్రేట్ చేసుకున్నానన్నాడు. కొంతకాలానికి వ‌ర‌ల్డ్‌క‌ప్ విజ‌యం ఎంత ప్ర‌త్యేక‌మో తెలిసిందని.. మ‌రోసారి వ‌రల్డ్‌క‌ప్ సాధించాల‌నే కోరిక‌తో క్రికెట్ ఆడ‌టం మొద‌లుపెట్టానన్నాడు.. క్రికెట్ ఆడ‌టం మొద‌లుపెట్టాక 22 ఏళ్ల త‌ర్వాత నా క‌ల ఫలించింది. వ‌ర‌ల్డ్‌క‌ప్ అందుకున్న క్ష‌ణాల‌ను వ‌ర్ణించ‌లేను.. మ‌న జీవితంలో క్రీడలు ఎంత ముఖ్య‌మో, వాటి మ్యాజిక్ ఎలా ఉంటుందో అసలు ఊహించలేమని సచిన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సచిన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పలువురు సెలెబ్రిటీలు, అభిమానులు సచిన్ కు శుభాకాంక్షలు తెలిపారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.