కాలకేయుని కిలికి భాషలో ఓ సినిమా వస్తే..

By సుభాష్  Published on  22 Feb 2020 9:53 AM IST
కాలకేయుని కిలికి భాషలో ఓ సినిమా వస్తే..

బాహుబలిలో కాలకేయుడు మాట్లాడిన కిలికి భాష గుర్తుందా? అప్పట్లో అదొక క్రేజ్. మహాకాయుడు ప్రభాకర్ కాలకేయుడిలా భీకరమైన చూపులతో క్రౌర్యాన్నంతా రంగరించి ఆ భయంకర భాషను పలికితే హాల్లో చప్పట్లు దద్దరిల్లాయి. ఆ సినిమా అయిపోవడంతోనే ఆ భాష పనీ అయిపోతుందనుకున్నాం. కానీ కిలికి బ్రతికే ఉంది. అంతే కాదు. కిలికి భాషను నేర్చుకోవాలనుకునే వారందరికీ ఇప్పుడు ఆ భాషను నేర్పించే ఏర్పాట్లు రెడీగా ఉన్నాయి.

కిలికి భాషను సృష్టించిన మదన్ కార్కీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సులువైన భాషగా దీన్ని పేర్కొంటున్నాడు. అంతే కాదు. దీని కోసం www.kiliki.in అనే వెబ్ సైట్ ను కూడా రూపొందించాడు. దాదాపు మూడు వేల పదాలకు ఇంగ్లీష్ అర్థాలను ఇస్తూ ఒక డిక్షనరీని కూడా తయారు చేశాడు. పదసంపదతో వివిధ గేమ్స్ ను కూడా ఆన్ లైన్లో సృష్టించాడు. నిజానికి బాహుబలిలో కిలికి భాషను వాడిన తరువాత మదన్ కాలేజీల్లో ప్రసంగించేందుకు వెళ్తే అక్కడ విద్యార్థులు కిలికి భాషలో మాట్లాడమని అడిగేవారు. దీనిని గుర్తించి, ఈ భాషను డెవలప్ చేశాడు మదన్. పెద్ద పెద్ద పదబంధాలు లేకుండా, పెద్దగా గ్రామర్ అవసరం లేకుండా భాషను వికసింపచేశాడు. అలా 2౨ సింబల్స్ సాయంతో లిపిని తయారు చేశాడు.

ప్రపంచంలోని ప్రతి భాష ఒక జాతితో ముడిపడి ఉంటుంది. కానీ నా భాష ప్రపంచాన్నంతటినీ ముడిపెడుతుంది. కలుపుతుంది. ఇలా కిలికి ఒక ప్రపంచ భాషగా అభివృద్ధి చెందాలన్నదే నా ప్రయత్నం అంటున్నాడు మదన్. ఇప్పుడు ఈ భాష ద్వారా కళలను , ఒక కల్చర్ ను డెవలప్ చేయాలన్నది అతని ప్రయత్నం. ఈ భాషకు వ్యాకరణాన్ని కూడా తయారు చేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుతం మదన్ రాజమౌళి నిర్మిస్తున్న ఆర్ ఆర్ ఆర్ కి సంభాషణలు రాస్తున్నాడు. కిలికి భాష ద్వారా ఉపాధి అవకాశాలను కూడా పెంచాలని అతను భావిస్తున్నాడు. అన్నీ కుదిరితే కేవలం కిలికి భాషలోనే ఒక సినిమా కూడా తీయాలని మదన్ అనుకుంటున్నాడు.

Next Story