ఇంటి పక్కనే జంక్ ఫుడ్ జాయింట్ ఉందా... తస్మాత్ జాగ్రత్త!!
By సత్య ప్రియ Published on 30 Oct 2019 11:46 AM ISTమీ ఇంటి వద్ద కానీ, మీ పిల్లల స్కూలు వద్ద కానీ అనారోగ్యకర తిను బండారాల రెస్టారెంట్లు ఉన్నాయా? అయితే తస్మాత్ జాగ్రత్త!!
ఎందుకంటే, న్యూయార్క్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ వారి పరిశోధనల ప్రకారం, వీటి ప్రభావం నేరుగా మీ పిల్లల ఆహారపు అలవాట్ల మీద పడుతుందట.
'ఒబీసిటీ' అనే జర్నల్ లో ప్రచురించిన వీరి పరిశోధన ప్రకారం, రెస్టారెంటుకి... మీ నివాసానికీ ఉండే దూరానికి... పిల్ల ఊబకాయానికీ సంబంధం ఉందట. అంటే, జంక్ ఫుడ్ ఉండే రెస్టారెంట్ చాలా దగ్గర ఉంటే, చుట్టుపక్కల నివసించే పిల్లల్లో ఎక్కువ శాతం ఊబకాయులై ఉంటారట.
పరిశోధకుల బృందం ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లకు అతిదగ్గరగా నివసించే (సుమారు 0.025 మైళ్లు) 5 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలను పరిశీలించగా, వారిలో 20శాతం ఊబకాయం తోనూ, 38 శాతం అధిక బరువు తోనూ బాధ పడుతున్నారని తేలింది. దూరం పెరుగుతున్న కొద్దీ 1 నుంచి 4 శాతం వరకూ ఓబకాయం తగ్గుతూ వస్తుంది.
సీనియర్ రీసర్చర్ బ్రయన్ ఎల్బెల్ మాట్లాడుతూ, "అనారోగ్యకర ఆహారపు దూకాణాల కు దగ్గరగా నివసించడం వల్ల పిల్లల్లో ఊబకాయం పెరుగుతోంది. వాటికి కొద్దిగా దూరంలో నివసించేవారిలో కొద్ది శాతమైనా ఊబకాయం తగ్గుతోంది. " అన్నారు.
పిల్లల్లో ఊబకాయం వల్ల, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎన్నో తలెత్తుతాయి. గుండె సంబంధిత రోగాలూ, మధుమేహం వంటి ఎన్నో మహమ్మారులు చిన్న వయసులోనే వారికి సోకే ప్రమాదం ఉంది.
ఈ పరిశోధన అమెరికా లోని పిల్లలపై చేసినది అయినప్పటికీ, గత కొన్ని సంవత్సరాలుగా భారత దేశంలో కూడా ఇదే పంధా కనిపిస్తోంది. పిజ్జా, బర్గర్ రెస్టారెంట్లు పెరుగుతున్న కొద్దీ, పిల్లల్లో ఊబకాయం పెరుగుతోంది. ఇది ముందే గుర్తించి తగిన చర్యలు తీసుకోకపోతే, మన దేశంలో కూడా ఊబకాయం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది