కియా కార్ల తయారీ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకి తరలిపోతున్నట్లుగా నేషనల్ మీడియాలో కథనం ప్రచురితమైంది. ఈ కథనంలో ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా పెనుగొండలో ఉన్న కియా కార్ల తయారీ సంస్థ తమిళనాడుకు తరలిపోతున్నట్లుగా రాసుకొచ్చాయి నేషనల్ మీడియా సంస్థలు. ఈ మేరకు ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వ అధికారులతో కియా యాజమాన్యం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా కూడా రాశాయి. ఇందుకు కారణం రాష్ర్టంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం పారిశ్రామిక రాయితీలపై పునరాలోచన చేయడమేనంటూ పేర్కొంది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హయాంలో పారిశ్రామిక సంస్థ వివిధ రాయితీలిచ్చింది. దీంతో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు వివిధ రాష్ర్టాలు పోటీ పడగా..ఆఖరికి ఏపీలో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకే కియా మొగ్గు చూపింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 15వేల మందికి, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి కూడా లభిస్తుందని కియా తెలిపింది.

అయితే..కియా పరిశ్రమకు ఇచ్చిన రాయితీలపై ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం సమీక్షిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయ్. అంతేకాకుండా స్థానికంగా ఉన్న నేతల నుంచి తమకు బెదిరింపులొస్తున్నాయని వాపోయింది. ఈ మేరకు గతంలోనే కియా యాజమాన్యం ఫిర్యాదు కూడా చేసినట్లు జాతీయ మీడియా ప్రచురించిన కథనంలో పేర్కొన్నారు. ఈ పరిశ్రమలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఇందుకొక కారణమని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. కియ పరిశ్రమను నెలకొల్పడంతో పెనుగొండ పరిసరాల్లో ఉన్న భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో కియాను ఏపీ నుంచి తరలిస్తే ఏపీలో మున్ముందు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఎవరూ ముందుకు రారన్నది జాతీయ మీడియా చెబుతున్న విషయం.

ఈ కథనంపై స్పందించిన కియా యాజమాన్యం సంస్థ..తాము ఎక్కడికి పరిశ్రమను తరలించడం లేదని, అంతర్జాతీయ మీడియాలో వచ్చిన రాతలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశాయి. అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనం అబద్ధమని పరిశ్రమలు, రవాణ, పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం, కియా కలిసి పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.