ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి దిగి విశ్వేశ్వరయ్య విగ్రహం వైపు వస్తుంటే దిగువన తుప్పుపట్టి, పనికిరాకుండా పడున్న జీ హెచ్ ఎంసీ వాహనాల డంప్ యార్డ్ కనిపిస్తుంది. చెల్లాచెదురుగా ఇష్టా రాజ్యంగా, అడ్డదిడ్డంగా పడున్న వాహనాలు చూసేవారికి కంటగింపుగా కనిపిస్తాయి. కానీ త్వరలో ఆ కంటగింపు 'కంటికింపు'గా మారబోతోంది. అవునండీ... మీరు విన్నది నిజం.

ఆ ప్రదేశంలో జీ హెచ్ ఎంసీ అధికారులు త్వరలో వర్టికల్ గార్డెన్స్ ఏర్పాటు చేయబోతున్నారు. పూలు, తీగెలు, పచ్చని ఆకులు మీకు కనువిందు చేయబోతున్నాయి. తెలతెలవారి సూర్యుడి కిరణాలు వాటిపై పడి ప్రతిఫలిస్తుంటే ఒక గోల్డెన్ గ్రీన్ యాత్ర చేసిన అనుభూతి కలగబోతోంది. నగరంలోని అత్యంత రద్దీ జంక్షన్లలో ఒకటైన ఖైరతాబాద్ జంక్షన్ ఇక కన్నుల పండువ కాబోతోంది. ఇప్పటికే ఇలాంటి వర్టికల్ గార్డెన్స్ లేదా నిలువు తోటలు టాంక్ బండ్ దగ్గరి జీ హెచ్ ఎం సీ ఆఫీసు, జోనల్ ఆఫీసుల్లో దర్శనమిస్తున్నాయి. దాదాపు రూ. ౩౩ లక్షల వ్యయంతో త్వరలో ఈ వర్టికల్ గార్డెన్ రాబోతోంది.

రెండు వందల అడుగుల మేరకు పదడుగుల ఎత్తున ఈ గార్డెన్స్ ఏర్పాటు అవుతోంది. మొక్కలు, ఆకులు, కొమ్మలతో ఒక సీతాకోక చిలుక ఆకారాన్ని కూడా జీ హెచ్ ఎం సీ త్వరలో ఏర్పాటు చేయబోతోంది. అంతే కాదు. విశ్వేశ్వరయ్య జంక్షన్ లో పాడైపోయిన శతధార ఫౌంటెన్ ను విశ్వేశ్వరయ్య విగ్రహం దగ్గర ఉన్న ఫౌంటెన్ ను బాగు చేయబోతున్నారు. దీని వల్ల ఈ జంక్షన్ లుక్కే మారిపోబోతోంది. పర్యావరణానికి దోహదపడటంతో పాటు, పచ్చదనం తో కన్నుల విందు చేయడం కోసమే జీ హెచ్ ఎం సీ ఇదంతా చేయబోతోంది. ఎన్టీ ఆర్ గార్డెన్స్ నుంచి విశ్వేశ్వరయ్య జంక్షన్ దాకా ట్రాఫిక్ జామ్ లు ఉండటంతో వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ సమయంలో వారి కంటికింపైన వర్టికల్ గార్డెన్ ఉంటే బాగుంటుందన్న ఆలోచన మేరకే ఈ గార్డెన్ ఏర్పాటు కాబోతోంది.ఇకపై ఈ రోడ్డు పక్కన చెత్త ఏరే వాహనాలను నిలుపు చేయరు.

ఈ 260 అడుగుల మేర పన్నెండు రకాలకు చెందిన పన్నెండు వేల చెట్లను నాటబోతున్నారు. ఈ మొక్కలకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరందించేందుకు కాంట్రాక్టర్ కు బాధ్యత అప్పగించబోతున్నారు. త్వరలో మీకీ చెయ్యెత్తు ఆకుపచ్చ తెర కనిపించబోతోంది. ఇంకేం ... మరి... చలో ఖైరతాబాద్ జంక్షన్.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story