హెల్మెట్‌లో పాము.. చూసుకోకుండా పెట్టుకున్నాడు.. తరువాత

By Newsmeter.Network  Published on  14 Feb 2020 10:40 AM GMT
హెల్మెట్‌లో పాము.. చూసుకోకుండా పెట్టుకున్నాడు.. తరువాత

మీరు హెల్మెట్‌ పెట్టుకుంటారా..? అయితే హెల్మెట్‌ ధరించే ముందు ఓ సారి హెల్మెట్‌ లోపల మొత్తం చూసి పెట్టుకోండి.. ఎందుకంటారా..? ఎందుకంటే.. అందులో పాములు ఉండవచ్చు. అరే.. హెల్మెట్‌లో పాములు ఎందుకు ఉంటాయనేగా మీ సందేహాం.. అయితే ఇది చదవండి..

కేరళలోని ఓ ఉపాధ్యాయుడి హెల్మెట్‌లో విషపూరితమైన పాము ఉంది. అయితే అతను చూసుకోకుండా పెట్టుకున్నాడు. అలా కొన్ని కిలోమీటర్లు ప్రయాణించినా గుర్తుపట్టలేకపోయాడు. హెల్మెట్‌ తీసిన తరువాత చూసి షాకయ్యాడు. వివరాల్లోకి వెళితే..

కేరళలోని కందానాద్‌ సెయింట్ మేరీ హైస్కూల్‌లో రంజీత్ సంస్కృతం టీచర్ గా పనిచేస్తున్నాడు. అతను రోజు మాదిరిగానే ఫిబ్రవరి 5న క్లాస్‌లు ముగిసిన అనంతరం మరో స్కూల్‌కి బైక్‌పై బయలుదేరాడు. అక్కడికి చేరుకున్న తర్వాత హెల్మెట్ తీశాడు. లోపల ఏదో కదులుతున్నట్లుగా అనిపించడంతో దాన్ని చూసి షాకయ్యాడు. లోపల ఓ విషపూరితమైన పాము ఉంది. అదృష్టం ఏంటంటే.. అది చనిపోయి ఉంది. అది అతడిని కాటేసి ఉంటుందనే భయంతో హాస్పిటల్‌కి వెళ్లగా.. వైద్యపరీక్షల్లో పాము కాటు వేయలేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అయితే.. అది అతడు హెల్మెట్ పెట్టుకున్న తర్వాత చనిపోయిందా.. లేదా ఎవరైనా చనిపోయిన పామును హెల్మెట్‌లో పెట్టారనేది తెలియరాలేదు. ఈ ఘటనపై రంజిత్ మాట్లాడాడు. ‘‘ఆ పాము నా హెల్మెట్‌లోకి ఎప్పుడు దూరిందో తెలీదు. చిన్న పాము కావడం వల్ల అది లోపల ఉన్న సంగతే తెలియలేదు. మా ఇంటికి దగ్గర ఒక చెరువు ఉంది. ఆ పాము అక్కడి నుంచే హెల్మెట్‌లోకి వెళ్లి ఉంటుంది’’ అని తెలిపాడు.

Next Story