కరోనా ఉందని రాళ్లతో కొట్టి చంపేశారు..!

By సుభాష్  Published on  19 March 2020 12:48 PM GMT
కరోనా ఉందని రాళ్లతో కొట్టి చంపేశారు..!

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకు కరోనా మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా మరణాలు 8వేలకుపైగా చేరగా, భారత్‌లో నాలుగు చేరుకుంది. కరోనా మరణాల్లో మొదటి స్థానంలో చైనా ఉండగా, రెండు స్థానంలో ఇటలీ ఉంది. ప్రస్తుతం ఇటలీ చైనాను దాటేసి మొదటి స్థానంలో చేరే అవకాశాలున్నాయి. ఇక కరోనా బారిన పడ్డ 2 లక్షల మంది వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే కరోనా విబృంభించడంతో అన్నిదేశాలు అప్రమత్తమై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.

ఇక తాజాగా కెన్యాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి కరోనా సోకిందనే అనుమానంతో కొందరు యువకులు అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. క్యాలే ప్రాంతంలోని ఎంసాబ్వెని గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. జార్జ్‌ కొటిని హెజ్రోన్‌ అనే వ్యక్తి బార్‌కు వెళ్లి వస్తుండగా, అక్కడ అతన్ని కొందరు యువకులు అడ్డుకున్నారు. అతడు మద్యం సేవించి ఉండటంతో అటూ ఇటూ ఊగుతూ నడుస్తుండటంతో అతనికి కరోనా ఉందని యువకులు రాళ్లతో తీవ్రంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితున్ని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ నిజంగా అతనికి కరోనా వైరస్‌ ఉందా.. లేదా అనే విషయం స్పష్టతలేదు.

Next Story