కేసీఆర్ సంచలన నిర్ణయం.. తుపాకులగూడెం బ్యారేజీకి 'సమక్క' పేరు
By సుభాష్ Published on 12 Feb 2020 7:10 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గోదావరి నదిమీద నిర్మిస్తున్న తుపాకుల గూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదివాసీ వీరవనిత, వన దేవత అయిన 'సమక్క' పేరు పెట్టాలని నిర్ణయించారు.ఈ మేరకు తుపాకులగూడెం బ్యారేజీకి 'సమ్మక్క బ్యారేజీ'గా నామకరణం చేస్తూ సంబంధిత జీవోను జారీ చేయాలని ఇఎన్సీ మురళీధర్‌రావును ఆదేశించారు. ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉండటంతోనే తెలంగాణలో అభివృద్ధి అనుకున్న రీతిలో జరుగుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే తెలంగాణలో బీడు భూముల్లోకి కళేశ్వరం సాగునీరు చేరుకుంటున్న శుభసందర్భంలో పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లు పెట్టుకున్నామని సీఎం గుర్తు చేశారు.
కాగా, గురువారం సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరంప్రాజెక్టులోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుకుంటుందని, ఇప్పుడు మనం కట్టుకున్న బ్యారేజీలు నిండుకుండాల మారాయని అన్నారు. రానున్న వర్షాకాలం నుంచి వరద నీటి ప్రవాహం పెరుగుతోందని, ప్రాణహిత ద్వారా లక్ష్మీ బ్యారేజీకి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తిపోసుకునే దిశగా, కాలువలకు మళ్లీంచే దిశగా ఇరిగేషన్ శాఖ ఇప్పటి నుంచి అప్రమత్తం కావాలని సూచించారు.