ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

By Newsmeter.Network  Published on  26 Dec 2019 8:07 AM GMT
ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును రెండేళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఆర్టీసీలో ఉన్న ప్రతి ఉద్యోగికి ఈ విరమణ వయసు వర్తించనుంది. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు ప్రభుత్వం పెంచడంపై ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసుల పెంపు ఉత్తర్వులపై సీఎం కేసీఆర్‌ బుధవారం నాడు సంతకం చేశారు. ఇటీవల ఆర్టీసీ కార్మికుల తమ డిమాండ్ల సాధన కోసం 52 రోజుల పాటు సమ్మెకు దిగారు. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులతో చర్చల సందర్భంగా పదవీ విరమణ వయసును పెంచుతామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వచ్చే ఐదేళ్లలో 9,375 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పదవీవిరమణ వయసు పెంచడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తర్వాత తమ వంతనేని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

2018 తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ మేనిఫెస్టో పదవీ విరమణ వయసును పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం పదవీ విరమణ వయస్సుపై కసరత్తు చేసింది. ఆర్ధిక శాఖ నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని అమలు చేస్తే నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా తాజాగా ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో ఈ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆర్టీసీ కార్మికుల విరమణ వయస్సును పెంచిన సీఎం కేసీఆర్‌ తమ పట్ల కూడా త్వరలోనే సానుకూలంగా స్పందిస్తారని ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్‌ అధికారులు, ఉద్యోగ సంఘాలు భావిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్గో సేవలు విస్తరించాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలతో పాటు పక్క రాష్ట్రాలకు కూడా కార్గో సేవలను విస్తరించానలి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సరకును ఆర్టీసీ కార్గోలోనే రవాణా చేస్తామన్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయాలని, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఉద్యోగల సంక్షేమం కోసం ఏర్పాటు చేసే సంక్షేమ మండలిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిపోల నుంచి ఇద్దరేసి చొప్పున 202 మందికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. బుధవారం నాడు సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమీక్షలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ ఎస్కే జోషి, ఆర్టీసీ యాజమాన్యం పాల్గొన్నారు.

Next Story
Share it