వైభవంగా సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక నిశ్చితార్థం

By సుభాష్  Published on  19 Oct 2020 10:00 AM GMT
వైభవంగా సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక నిశ్చితార్థం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత తీసుకున్న ప్రత్యూష నిశ్చితార్థం ఆదివారం విద్యానగర్‌లోని హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. రాంనగర్‌ ప్రాంతానికి చెందిన చరణ్‌రెడ్డితో ఆమె నిశ్చితార్థం జరిగింది. చరణ్‌రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. గతంలో సొంత తండ్రి, పినతల్లి చిత్ర హింసలకు గురి చేయడంతో తీవ్ర గాయాలైన ప్రత్యూష ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆమె ధీనస్థితిని చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పెద్ద మనసు చేసుకుని తానే స్వయంగా ప్రత్యూషను దత్తత తీసుకున్నారు. ఆమె సంరక్షణ బాధ్యతలను ఐఏఎస్‌ అధికారి రఘునందన్‌రావుకు అప్పగించారు. కాగా, తీవ్రంగా గాయపడిన ప్రత్యూష ఐదేళ్ల కాలంలో పూర్తిగా ఆరోగ్యం మెరుగు పడింది. మంచి చదువును చదివింది. నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తోంది. ఈ క్రమంలో ప్రత్యూష గురించి తెలుసుకున్న చరణ్‌రెడ్డి ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్దపడ్డాడు.

ఈ మేరకు ఆమెను సంప్రదించగా, ఆమె కూడా అంగీకరించింది. దీంతో మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలుపగా, వారు ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసీఆర్‌ ఆమెను ప్రగతిభవన్‌కు పలిపించుకుని మాట్లాడారు. ప్రత్యూష పెళ్లడబోయే చరణ్‌రెడ్డి వివరాలు వివరాలను తెలుసుకున్న కేసీఆర్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నిశ్చితార్థానికి వెళ్లాలని మహిళా సంక్షేమ శాఖ కమిషనర్‌ డి.దివ్యకు సూచించారు. కమిషనర్‌ ఆధ్వర్యంలో ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది. తన పెళ్లికి ఖచ్చితంగా వస్తానని కేసీఆర్‌ చెప్పారని, ఆయన అండతో కోలుకున్నానని ప్రత్యూష చెప్పారు. పెళ్లి చేసుకుని మంచి కుటుంబంలో వెళ్తున్నందు సంతోషంగా ఉందన్నారు.

Kcr Adopted Daughter Prathyusha Engagement 1

కాగా, తండ్రి, పిన తల్లి చేతిలో చిత్ర హింసలకు గురై దాదాపు చావు బతుకుల వరకు వెళ్లిన ప్రత్యూష.. కేసీఆర్‌ చొరవతో మామూలు మనిషిగా మారిన విషయం తెలిసిందే. ప్రత్యూష కోలుకున్న తర్వాత స్వయంగా కేసీఆర్‌ ప్రగతి భవన్‌కు పిలిపించుకుని ఆమెతో కలిసి భోజనం చేయడమే కాకుండా దత్తత కూడా తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలా సీఎం దత్తపుత్రికగా మారి ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్న ఆమె.. ఇప్పుడు ఓ ఇంటికి కోడలి కాబోతోంది.

Next Story