కర్రసాములో తెలంగాణ కొదమ సింహం డా. ఆకుల శ్రీధర్

By సుభాష్  Published on  4 March 2020 4:12 PM GMT
కర్రసాములో తెలంగాణ కొదమ సింహం డా. ఆకుల శ్రీధర్

ఒకప్పుడు ఊరూరా కర్ర సాము అభ్యాసం చేసేవారు. ప్రతి యువకుడూ కర్ర సాము చేసేవాడు. కానీ ఇప్పుడు అలనాటి యుద్ధ విద్య కర్ర సాము ఆదరణ లేక అంతరించిపోతోంది. అలాంటి కర్రసాముకు మళ్లీ ప్రాణం పోసి, మళ్లీ దానికి ఆదరణను కల్పించి, ఆ శ్రీధర్ జానపద కళారూపాలపై ఎమ్మె చేసి, అదే విషయంలో ఎం ఫిల్, ఆ తరువాత పీ హెచ్ డీ చేశాడు. కర్రసాము విధానాల విశ్లేషణపై ఆయన చేసిన పరిశోధనకు పీ హెచ్ డీ వచ్చింది.

ఈ కళను ఎవరైనా నేర్చుకోవచ్చు. దీనికి జాతి, కుల మతాల భేదాలు లేవు. వయోపరిమితితో సంబంధం లేదు అంటారు డా ఆకుల శ్రీధర్. కర్రసాము మనిషిని ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది. చేతులు, కళ్ల మధ్య సమన్వయాన్ని, చురుకుదనాన్ని నేర్పిస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది అంటారాయన. చిన్న నాడే తండ్రి ఆకుల సూరయ్య బాడీ బిల్డింగ్, కళాత్మకతను చూసి శ్రీధర్ ప్రభావితుడయ్యారు. ఆరో తరగతిలో కంటి పోశం మాస్టర్ వద్ద కర్రసామును నేర్చుకోవడం ప్రారంభించారు. అంతే ఆన నాటి నుంచి వెను తిరగలేదు.

2013 లో కూకట్ పల్లిలో కృష్ణ సింధూరి హౌస్ ఆఫ్ ఫైనార్ట్స్ లో ఎండీ మాలె శ్రీనివాసరెడ్డి ప్రోద్బలంతో ఆకుల శ్రీధర్ కర్రసాము ప్రదర్శనను ఇచ్చాడు. ఆ తరువాత 2017 లో రవీంద్ర భారతిలో సోలో ప్రదర్శనను ఇచ్చారు. ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వపు సాంస్కృతిక విభాగం డైరెక్టర్ మామిడి హరికృష్ణ తోడ్పాటులో ఈ కళా రూపాన్ని, మార్షల్ ఆర్ట్ ని మరింత ముందుకు తీసుకువెళ్లగలిగాడు. ఈ శివరాత్రి నాడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ముందు ఆయన కర్ర సాము ప్రదర్శనను ఇచ్చారు.

ప్రస్తుతం ఆయన హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట్, మహబూబ్ నగర్ లలో నెల రోజులు, నలభై అయిదు రోజులు, మూడు నెలల శిక్షణను ఉచితంగా ఇస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిణి, ఒగ్గు డోలు, కట్టె సాము వంటి క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహం శ్రీధర్ ను ఎంతగానే ప్రభావితం చేసింది. ఇప్పుడు యోగాసనాలకు ఎలా ప్రపంచవ్యాప్త ఆదరణ లభించిందో కర్రసాముకీ అలాంటి ఆదరణే లభించేలా చేయడమే నా ఆశయం అంటారు డా. ఆకుల శ్రీధర్.

Next Story