ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే వ్యక్తి ఎవరు..? అని ప్రశ్నిస్తే.. అందురూ ఠక్కున చెప్పే సమాధానం ఉసేన్‌ బోల్ట్. చిరుత పులిలా పరిగెత్తే అతని వేగం చూసి అందరం ఆశ్చర్యపోతాం. మరీ బోల్ట్ కంటే వేగంగా పరిగెత్తితే.. అది కూడా బురద మళ్లలో..

అలా పరిగెత్తి.. రాత్రికి రాత్రే సూపర్‌ స్టార్‌ అయ్యాడు కర్ణాటక కు చెందిన శ్రీనివాస గౌడ. కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ఐకళ ప్రాంతంలో ‘కంబళ’ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో శ్రీనివాస గౌడ (28) ముప్పయ్‌ ఏళ్ల రికార్డును తిరగరాశాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిద్రికి చెందిన గౌడ.. 142.50 దూరాన్ని కేవలం 13.62 సెకండ్లలో పరిగెత్తాడు. ఈ లెక్కన అతడు 100మీట్లర పరుగును కేవలం 9.55 సెకన్లలో పూర్తి చేశాడు.

వంద మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు ఉసేన్ బోల్ట్ పేరిట ఉంది. 2009లో బెర్లిన్‌లో బోల్ట్.. 100మీటర్ల పరుగును 9.58 సెకన్లలో పూర్తిచేసి రికార్డు నెలకొల్పాడు.  ఈలెక్కన చూస్తే బోల్ట్ కంటే శ్రీనివాసగౌడనే తక్కువ సమయంలో పరిగెత్తాడు. దీంతో శ్రీనివాస గౌడ పై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత ప్రభుత్వం అతన్ని ఒలింపిక్స్‌కు తయారు చేయించాలని కొందరు నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. అయితే, వేగంగా పరుగెత్తే దున్నల వల్లనే శ్రీనివాస గౌడ పరుగు ముడిపడి ఉందన్న విషయం మీరు ఇక్కడ గమనించాలి.

ఏమిటీ కంబళ..?

బురద పొలంలో రెండు దున్నలను పరుగెత్తిస్తూ.. వాటితో పాటు లక్ష్యాన్ని చేరుకోవడమే ఈ క్రీడ. గెలిస్తే నగదు బహుమతి లక్షల్లో ఉంటుంది. అందుకే ఈ పోటీల్లో పాల్గొనడానికి యువత అధిక సంఖ్యలో పోటీపడుతుంటారు. కాగా.. ఈ క్రీడ పట్ల జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. వేగంగా దున్నలను వేగంగా పరిగెత్తించేందుకు పోటీదారులు కొరడాతో బలంగా కొడుతుండంతో.. జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ పోటీలను కొన్నాళ్ల క్రితమే నిషేదించారు. కాగా కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య సీఎం అయ్యాక ఈ ఆటను మళ్లీ పునరుద్దరించారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.