కివీస్‌ పర్యటనలో ఉన్న టీమిండియా వన్డే, టెస్టు సిరీస్‌‌లలో పేలవ ప్రదర్శనపై మాజీ దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్ ఫైర‌య్యారు. బుద్ధి ఉండాలి.. అంటూ సెలక్షన్ కమిటీపై తీవ్ర‌స్థాయిలో ద్వ‌జ‌మెత్తారు. కివీస్ జ‌ట్టు మంచి క్రికెట్ ఆడుతోందని.. ఆట‌గాళ్లు మూడు వన్డేలలో, మొద‌టి టెస్టులో అద్భుతంగా రాణించార‌ని కొనియాడాడు.

ఇక టీమిండియా విష‌యానికొస్తే.. అసలు జట్టులో ఇన్ని మార్పులు ఎలా చేస్తారో నాకు అర్థం కావడం లేదంటూ సెలక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియా మ్యాచ్‌.. మ్యాచ్‌కు కొత్తగా కనిపిస్తోందని అన్నాడు. జట్టులో ఏ ఒక్క‌ ఆటగాడి స్థానం శాస్వ‌తం కాద‌ని.. నేడు ఉన్న ఆటగాడు రేపు కనిపించ‌ట్లేద‌ని అన్నాడు. టీమ్‌లో స్థానానికి భద్రత లేనప్పుడు అది ఆట‌గాళ్ల ఫామ్‌పై ప్రభావం చూపిస్తుందని అన్నాడు.

అలాగే.. జట్టులో సీనియ‌ర్‌ ఆటగాళ్లు ఉండీ.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 200 పరుగులు చేయకపోవడం దారుణమ‌ని క‌పిల్ వాపోయాడు. ప్ర‌త్య‌ర్థిపై ఓ ప్లాన్‌తో.. వ్యూహాత్మకంగా ఆడాలని సూచించాడు. మొద‌టి టెస్ట్ తుది జట్టులో కేఎల్ రాహుల్ లేకపోవడంతో నేను ఆశ్చ‌ర్యానికి గురయ్యాన‌ని పేర్కొన్నాడు. మేం ఆడినప్పటి రోజులకు, ప్రస్తుతానికి చాలా తేడా ఉందని కపిల్ అన్నాడు.

సెల‌క్ట‌ర్లు ఓ జట్టును తయారుచేస్తున్నారంటే అది ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ఉండాలని.. జట్టులో త‌ర‌చూ మార్పులు చూస్తుంటే మేనేజ్‌మెంట్‌కు ఆట‌గాళ్ల విష‌యంలో అవ‌గాహ‌న లేద‌నే విషయం అర్థం అవుతోందన్నాడు. అలాగే సెల‌క్ట‌ర్ల‌కు బుద్ధి లేకపోవడం వల్లే.. ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌ను పక్కన పెట్టారని క‌పిల్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.