బస్సు ప్రమాదం.. 20 మంది సజీవదహనం

By సుభాష్  Published on  11 Jan 2020 7:19 AM IST
బస్సు ప్రమాదం.. 20 మంది సజీవదహనం

ముఖ్యాంశాలు

  • ప్రైవేటు బస్సును ఢీకొట్టిన ట్రక్కు

  • డీజిల్‌ ట్యాంకర్‌ పగిలి వ్యాపించిన మంటలు

  • ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం

  • మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌ గ్రేషియా

  • గాయపడిన వారిని రూ.50 వేలు

  • సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్న సీఎం యోగి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫరుఖాబాద్‌ నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ఏసీ బస్సును శుక్రవారం అర్థరాత్రి ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం 20 మందికి పైగా సజీవదహనమైనట్లు తెలుస్తోంది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కన్నౌజ్ నుంచి జైపూర్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా ప్రమాదం జరగడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులకు ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పారు. మంటల్లో చిక్కుకున్న కొందరిని రక్షించారు. తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ అధికారులను ఆదేశించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండు వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో డీజిల్‌ ట్యాంకర్‌ పగిలి భారీగా మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. ఘటన స్థలం రోదనలతో దద్దరిల్లిపోయింది.

Bus Accident1

మృతుల కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

ప్రమాదంపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ప్రభుత్వం తరపున ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు.

Kannauj bus

Next Story