కంబళ పోటీల్లో కర్ణాటకకు చెందిన శ్రీనివాస గౌడ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతున్న సంగతి తెలిసిందే. 100 మీటర్ల దూరాన్ని శ్రీనివాస గౌడ కేవలం 9.55 సెకన్లలోనే అధిగమించడమే అందుకు కారణం. పరుగుల చిరుతగా పేరుగాంచిన ఉసేన్ బోల్ట్ సాధించిన వరల్డ్ రికార్డ్ టైమింగ్ 9.58 సెకన్లు కాగా, గౌడ 0.3 సెకన్ల తేడాతో బోల్ట్ ను అధిగమించాడు.రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిన శ్రీనివాస గౌడకు మరో మంచి అవకాశం లభించింది. అదేమిటంటే సినిమాలో ముఖ్య పాత్ర పోషించడమే ‘కంబళ’ అనే సినిమాను త్వరలో రూపొందించనున్నారు. ఆ సినిమాలో శ్రీనివాస గౌడ కూడా నటించనున్నాడు. అవార్డు విన్నింగ్ ఫిలింమేకర్ అయిన నిఖిల్ మంజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. లోకేష్ శెట్టి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.

లోకేష్ శెట్టి మాట్లాడుతూ ‘ఈ సినిమాను మార్చి నెల ముగింపు సమయంలో తెరకెక్కిస్తామని.. ప్రస్తుతం కంబళ పోటీలు జరుగుతున్నందున.. ఈ రేసులు ఇంకో రెండు వారాల పాటూ కొనసాగనున్నాయి. తాము వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని భావిస్తున్నామని’ అన్నారు. కంబళ పోటీలు ముగిసే లోపే చాలా వరకూ చిత్రీకరణ పూర్తీ చేయాలని భావిస్తున్నామని తెలిపారు లోకేష్ శెట్టి. ఎందుకంటే ఆ తర్వాత దున్నపోతులు దొరకడం చాలా కష్టమని అంటున్నారు.

ఈ సినిమాలో నిజమైన జాకీలకు ఛాన్స్ ఇస్తున్నామని.. అలాగే అసలైన ట్రైనర్లు కూడా ఇందులో కనిపిస్తారని అన్నారు. కిషోర్ ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉండగా.. మొత్తం ఆరుగురు కంబళ జాకీలు సినిమాలో మంచి పాత్రల్లో కనిపించనున్నాడు. ఆ ఆరుగురు జాకీల్లో శ్రీనివాస గౌడ కూడా ఒకరు. మిగిలిన లీడ్ క్యారెక్టర్లకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అతి త్వరలోనే రానుంది. ఈ సినిమాలో కంబళ సంప్రదాయాలు చూపించాలని..కొందరి నిజ జీవిత ఘటనలు ఇందులో చూపించబోతున్నామని లోకేష్ తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, మన చుట్టూ జరిగే జాతరలు తమ సినిమాలో భాగమని లోకేష్ చెబుతున్నారు. ముఖ్యంగా కంబళ పోటీలకు సంబంధించిన అసలుసిసలు మజా ఈ సినిమా ద్వారా ఆడియన్స్ కు చేరుతుందని లోకేష్ నమ్మకంగా చెబుతున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.