16 నిమిషాలు మిగిలి ఉండగా ఏం జరిగింది..!

By సుభాష్  Published on  1 Feb 2020 11:07 AM GMT
16 నిమిషాలు మిగిలి ఉండగా ఏం జరిగింది..!

ముఖ్యాంశాలు

► వైమానిక శాస్త్రంలో డాక్టరేట్‌ సంపాదించిన మొట్టమొదటి మహిళ

► వైమానిక శాస్త్ర అధ్యయనం

► నేడు 'కల్పనా చావ్లా' వర్థంతి

భారతదేశంలో బాలికలు చదువుకునేందుకు పాఠశాలలకు వచ్చిందే 19వ శాతాబ్దం చివరిలో. 20వ శాతాబ్దంలో స్త్రీలు గ్రంథాన్ని తాకడమే పాపమని భావించేవారు. స్వల్పకాలంలోనే మహిళలు తాము ఏ విషయంలోనూ పురుషులకు తీసిపోమని నిరూపించారు. అలాంటి ప్రతిభా సంపన్న మహిళల్లో 'కల్పనా చావాల' ఒకరు. భారతదేశ హృదయ స్పందనగా ఎంతో కాలం ప్రజల హృదయాల్లో ఆమె నిలిచిపోయారు. ప్రశంసనీయమైన మహిళా శాస్త్రవేత్తగా, అంతరిక్ష యాత్ర చేసిన మొట్టమొదటి భారతీయ మహిళా వ్యోమగామిగా ప్రసిద్ది చెందారు. ఫిబ్రవరి 1న ఆమె వర్థంతి.

1997, నవంబర్‌ 19 నుంచి డిసెంబర్‌ 5వరకు తన కొలంబియా అంతరిక్ష యాత్రలో వ్యోమగామినిగా భూమిని 104 మిలియన్‌ కిలోమీటర్లు, 760 గంటలు, 252 సార్లు చుట్టి వచ్చారు. ఈ అంతరిక్ష యాత్రలో ఆమె ఎన్నో పరిశోధనలు చేశారు. యోగాభాయసం నుంచి ఒక కొత్త ఉపగ్రహం ఆమె చేసిన పరిశోధనల సంఖ్య 300 దాటిపోయింది. అంతరిక్షంలో అత్యధిక పరిశోధనలు, ప్రయోగాలు చేసిన మహిళా శాస్త్రవేత్తగా గుర్తించి ఆమెను ప్రశంసించారు.

16 నిమిషాలు మిగిలి ఉండగా..

ఇక కల్పనా చావ్లా తిరిగి 2003 జనవరి 16న పదహారు రోజుల పాటు తన అంతరిక్ష ప్రయాణం ప్రారంభించారు. అంతరిక్షంలో తన చివరి 80 పరిశోధనల ఫలితాలను నిర్ధారించి కృత్రిమ ఉపగ్రహం ద్వారా పంపించారు. భూమికి తిరిగి వచ్చేందుకు ఇంకా 16 నిమిషాలు మాత్రమే మిగిలి ఉండగా, ఒక ప్రయోగం విఫలమై కొలంబియా అంతరిక్షనౌక పేలిపోయింది. అందులో ఉన్న ఐదుగురు వ్యోమగాములతో పాటు కల్పనాచావ్లా కూడా మరణించారు

Kalpana Chawla

కల్పనా చావ్లా జననం:

మొట్టమొదటి భారతీయ మహిళా వ్యామగామిగా ప్రసిద్ది చెందిన కల్పనా చావ్లా 1961 జులై 1వ తేదీన హర్యానాలోని కర్నాల్‌పట్టణంలో జన్మించారు. ఆమెది మధ్య తరగతి కుటుంబం. ఆమె తల్లిదండ్రులకు నలుగురు పిల్లల్లో కల్పనా చావ్లా చివరిది. ఆమె 1976వరకు కర్నాల్‌లోని ఠాగూర్‌ పాఠశాలలో చదువుకున్నారు. ఆమె చదువులోనే కాక ఆటా పాటల్లో, సైన్స్‌ ప్రయోగాల్లో అందరికన్న ముందుండేవారు. చిన్నతనంలో తాను భవిష్యత్ లో ఇంజనీర్‌ అవుతానని చెప్పగా ఇంట్లో అందరూ విస్మయం చెందారు. ఆమె తండ్రి కొన్ని రోజులు మాట్లాడలేదు. కల్పన ఆ కాలంలో ఎక్కువగా రాత్రుల్లో మేడపైన పడుకుని ఆకాశంవైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండేవారట. ఏదో ఒక రోజు నక్షత్రాల్లో ఉంటానని ఇంట్లో చెబుతుండేవారట. అందుకే కర్నాల్‌లో ఆమెను 'స్టార్‌' అని పిలిచేవారట. కల్పనా తండ్రికి తెలియకుండా అక్కడి వైమానిక శిక్షణ సంస్థలో ఏచరి పైలట్‌గా కూడా లైసెన్స్‌ సంపాదించుకున్నారు. అనంతరం ఆమె పంజాబ్‌లో ఇంజనీరింగ్‌ కళాశాలలో వైమానిక శాస్త్ర శిక్షణలో చేరి డిగ్రీ ప్రారంభించి శిక్షణలో ప్రాథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యారట.

వైమానిక శాస్త్ర అధ్యయనం

అమెరికాలో కొలరాడో యూనివర్సిటీలో వైమానిక శాస్త్ర అధ్యయనం చేసి డాక్టరేట్‌ సంపాదించుకున్నారు. ఆ శాఖలో డాక్టరేట్‌ సంపాధించిన మొట్టమొదటి భారతీయ మహిళనే కల్పన చావ్లా. 1988లో ఆమె 'పాలపుంత పయనం' చేయాలని సంకల్పించారు. ఆ సంవత్సరమే ఆమె అమెరికా అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రవేశం పొందారు. మొదట అంతరిక్ష పరిశోధకురాలిగా తన ఉద్యోగం ప్రారంభించారు. తర్వాత 1993లో వ్యోమగామిని పరీక్షలో పాల్గొన్నారు. ఇక 1988లో జూన్‌ పియరీ హారిసన్‌ అనే విమానశ్రయ శిక్షకుడిని కల్పన వివాహం చేసుకున్నారు.

Kalpana Chawla

కల్పనా చావ్లా చివరి సారిగా 'నాసా'కు ఇచ్చిన ఇంటర్క్యూ ఇదే..

''కల్పనా చావ్లా రోదసీకి వెళ్ళే ముందు నాసాకి ఇచ్చిన ఇంటర్య్కూలో ఈమె తన కెరియర్ ఎలా ప్లాన్ చేసుకున్నారో వివరించారు. ''మేం ఉన్నత పాఠశాల లో చదువుకుంటున్నప్పుడు మేం కర్నాల్ అనే చిన్న ఊర్లో ఉండేవాళ్ళం. ఆ ఊర్లో ప్లయింగ్ కల్బ్ ఉండటం చాలా కలిసి వచ్చింది. నేనూ, మా సోదరుడూ సైకిల్ తొక్కుతూ ఊళ్ళో తిరుగుతుంటే ఆకాశంలో పుష్పక్ విమానాలు కనిపించేవి. ఇద్దరికీ వాటిల్లో ప్రయాణించాలని ఉండేది. ఒకసారి నాన్నను అడిగితే ప్లయింగ్ క్లబ్ కు తీసుకువెళ్ళి ఆ విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కు సంబంధించి ఇదే నా తొలి అనుభవం. ఎదిగే కొద్దీ జె.ఆర్.డి టాటా గురించి కూడా తెలిసింది. తొలిసారి మన దేశంలో విమానాలను నడిపింది ఈయనే. ఆనాడు టాటా నడిపిన విమానాన్ని కూడా చూశాను. విమానాన్ని చూసిన రోజుల్లో ఆయనేం చేసిందీ తెలుసుకోగానే నా ఆలోచనలు అలా అలా మబ్బుల్లో తేలిపోయాయి. హైస్కూలులో చదువుతున్నప్పుదు 'నీవు ఏం కావాలని అనుకుంటున్నావు' అని అడిగినపుడు 'ఏరోస్పేస్ ఇంజనీర్' అని టక్కున చెప్పేదాన్ని. అది నాకింకా గుర్తుంది. టెన్త్ క్లాసు తత్వాత ఇంటర్ లో చేరాలంటే ఇంటర్ లో ఏ గ్రూపు తీసుకోవాలన్నది ముందే నిర్ణయించుకోవాల్సి ఉండేది. నేను ఏరో స్పేస్ ఇంజనీర్ నికావాలని అనుకున్నందున లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవాలని నిర్ణయించుకున్నాను. ఇంజనీరింగ్ ముందే లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లెక్కల్లో ప్రావీణ్యం సపాదించాల్సి ఉంటుంది. తత్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో సీటు వచ్చింది.

అప్పట్లో నా లక్ష్యం ఏరోస్పేస్ ఇంజనీర్ కావడమే. వ్యోమగామి అవుతానని ఆ రోజుల్లో నేను ఊహించలేదు. ఎయిర్ క్రాప్ట్ ఇంజనీర్ కావాలని కోరుకున్నాను. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం కూడా క్లాసులో అడిగినప్పుదు 'ప్లైట్ ఇంజనీర్' అవునాను అని చెప్పాను. అప్పట్లో ప్లైట్ ఇంజనీర్ అంటే ఏం చేస్తారో కూడా నాకు అవగాహన లేదు. నేను అనుకొన్న ఎయిర్ క్రాప్ట్ డిసైనింగ్ కూ, ప్లైట్ ఇంజనీర్ కూ సంబంధం లేదు. ఇంజనీరింగ్ కాలేజీలో నాతో పాటే ఏడుగురే అమ్మాయిలం ఉండేవాళ్ళం. వాళ్ళల్లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చేసింది నేనొక్కదాన్నే. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కావాలన్నప్పుదు మా ప్రిన్సిపాల్ వద్దన్నారు. చాలా కష్టమని, ఎలక్ట్రికల్ గానీ, మెకానికల్ గానీ తీసుకోమన్నారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇవ్వండి. లేదంటే ఇంటికి వెళ్ళిపోతానంటూ చెప్పాను. చివరికి ఇవ్వక తప్పలేదు. 'నీకు అందుబాటులో ఉన్నది లేదూ అని కాదు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆ వైపు మాత్రమే ప్రయాణించాలి' అని మాత్రమే నేను యువతకు సూచించగలను'' అని కల్పనా చావ్లా తన చివరి సారిగా 'నాసా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

Kalpana Chawla1

Next Story