కాజల్‌ అగర్వాల్‌.. ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. కెరీర్‌ మొదలై 12 ఏళ్లయినా కూడా ఇప్పటికి ఈ బ్యూటీ అదే జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికి వరుస సినిమాలతో అదరగొడుతూనే ఉంది. ఒక వైపు కుర్ర హీరోలతో నటిస్తూనే సీనియర్లకు కూడా రోమాన్స్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘ముంబై సాగా’ అనే హిందీ సినిమాలో  నటిస్తుండగా, మరో వైపు కమల్‌ హాసన్‌ హీరోగా నటిస్తున్న ‘ఇండియన్‌ 2’ సినిమాలో కీలక పాత్ర చేస్తోంది. ఇక తాజాగా కాజల్‌ మెగాస్టార్‌ చిరంజీవి సరసన నటింస్తోంది. కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోంది.

కాగా, ముందుగా త్రిష నటిస్తుండగా, ఇతర కారణాలతో ఆమె తప్పుకొంది. తర్వాత చిత్ర బృందం కాజల్‌ను సంప్రదించగా, అందుకు అంగీకరించింది ఈ బ్యూటీ. ఇలా మొత్తం మూడు పెద్ద ప్రాజెక్టులు చేస్తున్న ఆమెకు మరో భారీ చిత్రంలో కూడా ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘తుపాకి 2’ ప్రారంభం కానుంది. ఇందులో  హీరోయిన్‌గా కాజల్‌కు అవకాశం వచ్చినట్లు సమాచారం. కాగా, ‘తుపాకి’లో కూడా కాజల్‌ నటించిన విషయం తెలిసిందే. అందుకే ఈ సారి కూడా ఈ ముద్దుగుమ్మనే ఎంచుకోవాలని మురుగదాస్‌ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా దర్శకుడు మురుగదాస్‌ కాజల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా దీనికి సంబంధించి ఓ ప్రకటన కూడా వెలువడనుంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.