జగన్ కే అంత తెగింపు ఉంటే.. నాకెంత తెగింపు ఉండాలి : పవన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Dec 2019 7:09 AM GMT
జగన్ కే అంత తెగింపు ఉంటే.. నాకెంత తెగింపు ఉండాలి : పవన్

• అమ్మాయిల రక్షణ కోసం చట్టాల్లో మార్పులు రావాలి

• సుగాలీ ప్రీతికి న్యాయం జరగకపోతే కర్నూలులో నిరసన ప్రదర్శన

• కులం కుంపట్లను వైసీపీ నాయకులు రాజేస్తున్నారు

అమలాపురం : రెండేళ్లు జైల్లో ఉన్న వ్యక్తికే ఆస్తుల కోసం, అధికారం కోసం ఇంత తెగింపు ఉంటే... ఆశయం కోసం పార్టీ పెట్టిన నాకు ఎంత తెగింపు ఉండాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. డబ్బు సంపాదన బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదని, డబ్బు సంపాదనపై ఆశే ఉంటే వేల కోట్లు సంపాదించేవాడినని ఆయన వెల్లడించారు. మండపేటలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన పవన్ మాట్లాడుతూ రైతుల ఆకలి బాధలు, కష్టాలు, కన్నీరు తెలియాలంటే ఆకలి బాధలు ఎలా ఉంటాయో తెలియాలని, అది తెలిసేందుకే ప్రతిరోజు ఒక పూట ఆకలితో ఉంటానన్నారు. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నాయకులు నా మాటలు వక్రీకరిస్తున్నారని విమర్శించారు. తాను ఏ మాట మాట్లాడినా అందులో ధర్మం ఉంటుందని, తల తెగిపడినా ఫర్వాలేదు కానీ ధర్మమే మాట్లాడుతానని తెలిపారు.

దిశ ఘటనను పవన్ ఈ సమావేశంలో ప్రస్తావించారు. ''దిశ అనే అమ్మాయిని నలుగురు వ్యక్తులు కిరాతకంగా మానభంగం చేసి హత్య చేస్తే దానిపై నా స్పందన అడిగారు. వైసీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారు. దిశను అంత క్రూరంగా చంపేస్తే రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలని నేనెందుకు అంటాను. అత్యాచారం చేయాలంటే భయపడే పరిస్థితులు రావాలంటే.. ముందు రోడ్డు మీద వెళ్లే అమ్మాయిలను ఎవడైనా కామెంట్ చేస్తే సింగపూర్ తరహాలో కేనింగ్ చట్టాన్ని అమలు చేయాలని అన్నాను. కేనింగ్ అంటే రెండు బెత్తం దెబ్బలు కాదు. కొడితే తోలు ఊడిపోతుంది. ఒక మనిషిని చంపేయడం సరైనదే అయితే చట్టం చేయండి. సౌదీ అరేబియాలో మాదిరి బహిరంగ శిక్షలు విధించండి. తప్పు చేయాలంటే భయపడేలా కాళ్ళు, చేతులు బహిరంగంగా నరికేలా చట్టాల్లో మార్పులు తీసుకురండి.'' అని పవన్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

• సుగాలీ ప్రీతి ఘటనపై కొడాలి నాని గారు మాట్లాడాలి

మంత్రులు నాని బ్రదర్స్ ఏం మాట్లాడతారో వారికే అర్థం కాదన్నారు పవన్. ఎందుకంటే వాళ్లకు తెలుగు సరిగా రాదని, మాతృభాష రాకపోవడం వల్ల వారికి ఇలాంటి దుస్ధితి వచ్చిందని విమర్శించారు. దిశ ఘటనలో మంత్రులు నాని బద్రర్స్ చాలా బాధపడినందుకు సంతోషం. అలాగే కర్నూలు పట్టణంలో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ లో సుగాలీ ప్రీతి అనే 15 ఏళ్ల మైనర్ బాలికను మూడేళ్ల క్రితం మానభంగం చేసి హతమార్చారు. ఆ కేసును బయటకు తీసి పూర్తిగా విచారణ చేసి నిందితులకు సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

• బోయ కులస్తుడి కడుపు మండింది

ఈ దేశంలో అన్ని కులాలు, మతాలు సమానమే. నేను పుట్టిన కులాన్ని, మతాన్ని ఎంత గౌరవిస్తానో.. ఇతర కులాలు, మతాలను అంతే గౌరవిస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ పేర్కొన్నారు. ఎన్ని కులాలు కష్టపడితే నా నోట్లోకి నాలుగు ముద్దలు వెళ్తాయో తెలిసిన వాడిని కనుకే.. పార్టీ సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచనా విధానం అని పెట్టానన్నారు. అలాంటి నేను ఎందుకు ఒక కులాన్ని తక్కువ చేసి మాట్లాడతాను. వైసీపీ నాయకులు పదేపదే ఇబ్బంది పెడుతుంటే కడుపుమండిన ఒక బోయ కులానికి చెందిన నాయకుడు తన ఆవేదన చెప్పుకోవడానికి నోరుజారి కొంతమంది వ్యక్తుల పేర్లను ఉదహరిస్తూ మాట్లాడాడని, అలా మాట్లాడిన వాటిలో కొన్ని పొరపాట్లు దొర్లాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని బహిరంగంగా ఉరి తీయాలని మాట్లాడారు. అప్పుడు ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు ఒక వ్యక్తి కడుపు మండి ఆవేదనతో మాట్లాడితే కులాల పోరాటంగా వైసీపీ నాయకుల చిత్రీకరిస్తున్నారని పవన్ మండిపడ్డారు. ఆ వ్యక్తి పడిన బాధను అర్ధం చేసుకొని క్షమించి వదిలేయాలి గాని తప్ప కులాల పోరాటంగా మార్చవద్దని సూచించారు. వైసీపీకి చెందిన రాజధాని దళిత రైతులు మా భూములకు మంచి ధరలు ఇప్పించమని అడిగితే అప్పుడు పార్టీలు చూడలేదు. రైతులకు న్యాయం జరిగితే చాలు అనుకుని ఉద్ధండరాయనిపాలెంలో పర్యటించి వాళ్లకు న్యాయం జరిగేలా చేశానని ఆయన వివరించారు. తప్పు చేస్తే క్షమించమని అడిగే వ్యక్తిత్వం తనకు ఉందని, అలాగే తప్పు చేయకపోతే మిమ్మల్ని కూడా వంగదీసి క్షమాపణ చెప్పిస్తానని పవన్ మరోసారి గుర్తుచేశారు.

• వ్యక్తిగతంగా దూషిస్తున్నారంటే పతనం మొదలైనట్లే : నాగబాబు

ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇన్ చార్జ్ కొణిదెల నాగబాబు ఈ సమావేశంలో మాట్లాడుతూ..చాలా పార్టీలకు అధికార దాహం తప్ప ఐడియాలజీ లేదన్నారు. చాలా గొప్ప ఐడియాలజీతో పెట్టిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని, ఇలాంటి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మన బిడ్డల భవిష్యత్తు అద్భుతంగా మారడానికి అవకాశం ఉంటుందన్నారు. నిజానికి అధికార పార్టీ భయపడాల్సింది ప్రతిపక్షానికి. తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దగా వాయిస్ బయటకు రాకపోవడంతో జనసేన పార్టీ వైసీపీ పాలకులకు కొరకరాని కొయ్యగా మారిందన్నారు. వారి పాలనలో తప్పులను ఎత్తిచూపుతూ నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది జనసేన పార్టీ అని ధీమాగా చెప్పారు. పవన్ కళ్యాణ్ పాలసీలపై ప్రశ్నిస్తే.. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారంటే వారి పతనం మొదలైందని ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ తో పర్యటించడం వల్ల తనకు రాష్ట్రంలోని సమస్యలపై అవగాహన పెరిగిందన్నారు. ఇకపై అందరం కష్టపడి పనిచేసి జనసేన పార్టీని బలోపేతం చేయాలని నాగబాబు జనసైనికులకు పిలుపునిచ్చారు.

Next Story
Share it