‘జర్నలిజమ్‌ అంటే కల్పితం కాదు’..!-ఏపీ ప్రభుత్వ సలహాదారు కె.రామచంద్రమూర్తి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Nov 2019 2:10 PM GMT
‘జర్నలిజమ్‌ అంటే కల్పితం కాదు’..!-ఏపీ ప్రభుత్వ సలహాదారు కె.రామచంద్రమూర్తి

అమరావతి: రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 2430ని విమర్శించడం తగదని రాష్ట్ర ప్రజా విధానాల ప్రభుత్వ సలహాదారు డా. కె.రామచంద్రమూర్తి హితవు పలికారు. డా.బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులకు ఎవరైనా భంగం కల్పిస్తే నేరమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు. గతంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కు పలు శాఖలపై పత్రికల్లో వచ్చిన తప్పుడు కథనాలపై ఆయా శాఖల తరపున ఖండనతో పాటు చట్టపరంగా కోర్టుకు వెళ్లే అధికారం ఉండేదన్నారు. ప్రస్తుతం ఆ జీవోను మార్పు చేసి మంత్రివర్గ ఆమోదంతో సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ప్రత్యేక అధికారాలను బదలాయించడం జరిగిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పనులు సకాలంలో అందరికీ చేరాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఈ క్రమంలో ఎక్కడ తప్పులు జరిగితే పత్రికలు ఆధారాలు, వివరణలతో ప్రచురించవచ్చన్నారు. ఏ వ్యక్తి, సంస్థ, ప్రభుత్వానికైనా అన్యాయం జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చన్నారు.

ఇటీవల అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ తప్పుడు కథనాలు రాస్తున్న పత్రికలపై చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం చేసే మంచి పనులను అభూత కల్పన చేసి ఆధారాలు లేకుండా పత్రికల్లో అసత్యాలు రాయడం వలన ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడం తగదని హితవు పలికారు. ఏ శాఖలో అయినా తప్పు జరిగితే సంబంధిత వార్త పత్రికల్లో ప్రచురితం అయినప్పుడు ఆయా శాఖ ఉన్నతాధికారులు బాధ్యత వహించి వివరణ ఇవ్వాలని, సంబంధిత ఖండనను పత్రికలు ప్రచురించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందన్నారు. అసత్య కథనాలు రాసిన పత్రికా యాజమాన్యాలకు నోటీసులు పంపడం, వివరణ కోరడం, న్యాయస్థానాల ద్వారా సమస్య పరిష్కరించుకోవడం జరుగుతుందన్నారు.

గత ప్రభుత్వం తమపై కేసులు పెట్టడం మూలాన ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరగడం జరుగుతోందని డా. కె.రామచంద్రమూర్తి అన్నారు. ఎవరైనా తమ స్వేచ్ఛకు భంగం వాటిల్లినప్పుడు న్యాయస్థానాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వంపై కల్పిత కథనాలు రాయడం వలన ప్రజలు గందరగోళానికి గురవ్వడం, అసమ్మతిని సృష్టించడం వలన వారిని తప్పుదోవ పట్టించడం నేరమే అవుతుందన్నారు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు. అధికారులు తప్పు చేస్తే ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ప్రజలే ప్రజాస్వామ్యంలో అంతిమనిర్ణేతలన్నారు. వార్తలు రాసే ముందు సంబంధిత వ్యక్తులను విచారించి ప్రచురించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఒకవేళ వారు స్పందించని పక్షంలో ఆ విషయాన్ని క్రోడీకరిస్తూ వార్తను ప్రచురించవచ్చన్నారు రామచంద్రమూర్తి.

Next Story