న్యాయం చేయండి.. హెచ్‌ఆర్సీని వేడుకున్న నడిగడ్డ రైతు పోరాట సమితి

By అంజి  Published on  6 Jan 2020 11:14 AM GMT
న్యాయం చేయండి.. హెచ్‌ఆర్సీని వేడుకున్న నడిగడ్డ రైతు పోరాట సమితి

జోగులాంబ గద్వాల్‌ రైతులకు న్యాయం చేయాలని కోరుతూ నాంపల్లిలోని మానవహక్కుల కమిషన్‌లో నడిగడ్డ రైతు హక్కుల పోరాట సమితి ఫిర్యాదు చేసింది. సీడ్‌ పత్తిరైతులను ఆర్గనైజర్లు మోసాలను అరికట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 40 వేల మంది రైతులు 30 వేల ఎకరాలకుపైగా సీడ్‌ పత్తిని పండిస్తున్నారని పోరాట హక్కుల సమితి చైర్మన్‌ రంజిత్‌ కుమార్‌ అన్నారు. సీడ్‌ పత్తి విత్తనాలను కంపెనీలు నేరుగా ఇవ్వకుండా మధ్యవర్తుల ద్వారా ఇస్తున్నారని.. ఇలా ఇవ్వడం వల్ల దోపిడీ జరుగుతోందన్నారు. కంపెనీలు పత్తి విత్తనాలకు ఇచ్చే రేటు దగ్గర నుంచి కమిషన్‌ పేరిట, తరుగుదల పేరిట, జీఓటీ పేరిట కాలయాపన చేస్తూ సుమారు 16 నెలల తర్వాత రైతులకు డబ్బులు చెల్లిస్తున్నారని రంజిత్‌ కుమార్‌ పేర్కొన్నారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్‌ని వేడుకున్నారు.

40 మంది ఆర్గనైజర్లు 40 వేల మంది సీడ్‌ పత్తి రైతులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. కంపెనీలు సీడ్‌ పత్తి ధర రూ.490కి ఇస్తుండగా ఆర్గనైజర్లు మాత్రం ప్యాకెట్‌ పత్తి ధరను రూ.410 ఇస్తూ మోస్తం చేస్తున్నారని తెలిపారు. డిసెంబర్‌లో పంటను తీసుకెళ్లే సమయంలోనే కంపెనీలు డబ్బులు చెల్లిస్తాయని, కానీ మధ్యలో ఉన్న ఆర్గనైజర్లు మాత్రం జులై దాకా ఇవ్వడం లేదన్నారు. ఆర్గనైజర్లు 24 శాతం రైతుల దగ్గర నుంచి వడ్డీ వసూలు చేస్తూ మోసం చేస్తున్నారని వివరించారు. సీడ్‌ పత్తి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని రంజిత్‌ కుమార్‌ అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మానవహక్కుల ఉల్లంఘన స్వేచ్ఛగా సాగుతోందన్నారు. దీనిపై అక్కడి అధికారులు ఆదేశాలు ఇవ్వాలని హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశామని రైతు పోరాట సమితి చైర్మన్‌ రంజిత్‌ కుమార్‌ తెలిపారు.

Next Story
Share it