ముఖ్యాంశాలు

► జగన్‌ సర్కార్‌పై జేసీ విమర్శల వర్షం

► కన్నెర్రజేసిన జగన్‌ సర్కార్‌

►జేసీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

జగన్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న జేసీ దివాకర్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలేలా ఉన్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ఇష్టానుసారంగా వ్యవహరించిన జేసీ సోదరులకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఏపీలో జగన్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జేసీలో తీరు మారలేదు. జగన్ సర్కార్‌పై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. జగన్‌ త్వరలో జైలుకెళ్తారని జోస్యం చెబుతున్నారు.

జేసీ వ్యాపారాలపై జగన్‌ సర్కార్‌ కన్నెర్ర

కాగా, కొంత కాలంగా జేసీ దివాకర్‌రెడ్డి వ్యాపారాలపై వైఎస్‌ జగన్ సర్కార్ కన్నెర్రజేసింది. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సులను దాదాపు సీజ్ చేసేసింది. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నాయని కేసులు నమోదు చేసింది ప్రభుత్వం. ఒక దశలో ట్రాన్స్‌ పోర్టు వ్యాపారం నుంచి తప్పుకుంటామని కూడా చెప్పారు జేసీ. కాగా, ఈ విషయంపై జేసీ కుటుంబం కోర్టును ఆశ్రయించింది.

ఇక తాజాగా జేసీ ట్రావెల్స్‌ కు చెందిన కొన్ని లారీలను బెంగళూరులో విక్రయించారు. ఎన్వోసీ తీసుకునే విషయంలో తాడిపత్రి ఎస్సై సంతకాలు పోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో జేసీ సోదరులకు కూడా ఇరుక్కునే అవకాశాలున్నాయి. ఇప్పటికే పోలీసులు నలుగురిని అరెస్ట్‌ చేశారు. దీంతో జేసీ సోదరులకు మరింత ఉచ్చు బిగిసేలా కనిపిస్తోంది.

మరో వైపు బీఎస్‌-3 వాహనాల విక్రయం కూడా జేసీ సోదరులకు మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2017లో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. బీఎస్‌-3 వాహనాలపై నిషేధం విధించింది. ఈ కారణంగా ఈ వాహనాలను విక్రయించకూడదు. బీఎస్‌-4 వాహనాలు మాత్రమే విక్రయించాలి. కానీ దాదాపు 68 బీఎస్‌-3కు చెందిన వాహనాలను నిబంధనలకు వ్యతిరేకంగా కొనుగోలు చేసినట్లు పోలీసులు జరిపిన విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఈ వాహనాలను నిబంధనలకు విరుద్దంగా బీఎస్‌-4వాహనాలుగా మార్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వాహనాలు జేసీ అనుచరుడు గోపాల్‌రెడ్డి పేరుమీద ఉన్నట్లు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. ఈ ఒక్క కేసులోనే భారీగా జరిమానా విధించే అవకాశాలున్నాయని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇది కనుక జరిగితే జేసీ కుటుంబం ఇబ్బందుల్లో చిక్కడం ఖాయమనే మాట వినిపిస్తోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.