హగిబిస్ దెబ్బకు జపాన్ అతలాకుతలం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Oct 2019 1:23 PM GMT
హగిబిస్ దెబ్బకు జపాన్ అతలాకుతలం

టోక్యో: జపాన్‌లో హగిబిస్‌ తుఫాన్‌ తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. దీంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హగిబిస్‌ తుఫాన్‌ ధాటికి మృతిచెందిన వారి సంఖ్య సోమవారం నాటికి 42కి చేరుకుంది. ఇప్పటి వరకూ 19 మంది గల్లంతైనట్టు సమాచారం. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. తుఫాన్‌ ప్రభావానికి గంటకు 216 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. చిబాలోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్లు దెబ్బతిన్నాయని అక్కడి అధికారులు తెలిపారు. దాదాపు 5 వేలకు పైగా నివాసాలలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలతో ఆ దేశంలోని ప్రధాన పట్టణాలు, నగరాలు జలమయం అయ్యాయి.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను హెలికాఫ్టర్లు, పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ తుఫాన్ రావడంతో రగ్బీ ప్రపంచ కప్ టోర్నమెంటును అధికారులు రద్దు చేశారు. తుఫాన్‌ బాధితులకు సాయం అందించేందుకు భారత నేవీ ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్‌ కిల్టన్‌లను ఆ దేశానికి తరలించింది. సహాయక బృందాలు దేశ వ్యాప్తంగా సహాయక చర్యలు చేపడుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు.

Next Story