శ‌ర్వానంద్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా ఫిబ్రవరి 7న వచ్చిన  చిత్రం ‘జాను’. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా పై ఎలా ఉందో  రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

రామ్(శర్వానంద్) ఓ వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు.  అయితే  తన చిన్ననాటి స్నేహితులు అంతా కలిసి ఒక గెట్ టు గేదర్ ను ఏర్పాటు చేస్తారు.  అక్కడికి జాను(సమంత)కూడా వస్తుంది.  ఒకప్పుడు ఒకే క్లాస్ స్కూల్ కు చెందిన జాను మరియు రామ్ ల మధ్య చిన్నప్పుడే  స్వచ్చమైన ప్రేమ పుడుతుంది.  ఆ తరువాత వారి మధ్య జరిగిన స్టోరీ ఏమిటి? వారు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది ? మళ్లీ చాలా కాలం తర్వాత కలిసిన వీరిద్దరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?అప్పుడు ప్రేమించుకున్న వీళ్ళ ప్రేమకు ముగింపు ఎలా వచ్చింది? ఈ మధ్యలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ స్థాయిలో ఆకట్టుకుంది  ? అసలు వారిద్దరి ప్రేమ కథలో వచ్చిన సమస్య ఏమిటి ? చివరకి రామ్  – జాను కథ  ఎలా సాగింది అనేది మిగతా కథ.

నటీనటులు :

జానుగా సమంత ఈ సినిమాలో  చాలా సింపుల్ లుక్ లో క్లాస్ గా ఎంట్రీ ఇచ్చింది. తన ఎంట్రీలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు తన నతనతోనూ మంచి ఫీల్ లోకి తీసుకెళ్లారు. కొన్ని సీన్స్ లో సమంత తన పెర్ఫార్మన్స్ తో అందరి కళ్ళు చెమర్చేలా చేసింది. ఊహించినట్టే హ్యాపీ ఎండింగ్ అయితే కాదు కానీ  సినిమాలో ఎమోషన్ మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది. ఇక జాను రామ్ ని ఎంతగా ఇష్టపడిందో, ఎంతగా రామ్ కోసం ఎదురు చూసిందో అనే ఫీలింగ్స్ ని రామ్ కి చెప్పే సీన్ లో సమంత నటన సింప్లీ సూపర్బ్.. రామ్ – జానుల కెమిస్ట్రీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లే ఆ సీన్ లో కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో రామ్ పాత్ర‌కు శర్వానంద్ ప్రాణం పోసాడు.  తన పాత్రలోని వేరియేషన్స్ కి తగ్గట్లు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్  చేస్తూ సినిమాలోనే శర్వానంద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

అలాగే రామ్ బెస్ట్ ఫ్రెండ్స్ గా వెన్నెల కిషోర్ అండ్ శరణ్య ప్రదీప్ లు బాగా చేశారు. జాను – రామ్ ల స్కూల్ డేస్ లవ్ చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. జాను స్కూల్ కి రానప్పుడు రామ్ టెన్షన్ పడే సీన్స్ ని చాలా బాగా తీశారు. ఫీల్ సూపర్బ్ గా వర్కౌట్ అయ్యింది. స్కూల్ డే లో రామ్ గా సాయి కిరణ్ , జాను గా గౌరీ గీత కిషన్ ల నటన బాగుంది.  అలాగే స్కూల్ లో వీరిద్దరి మధ్యా జరిగే సీన్స్ కూడా చాలా బాగున్నాయి. చూసే వారందరికీ వారి స్కూల్ డేస్ అండ్ ఫస్ట్ లవ్ ని గుర్తు చేస్తాయి. సినిమాలో మిగిలిన పాత్రల్లో  నటించిన నటినటులు అందరూ  తమ సపోర్టింగ్ రోల్స్  లో తమ పాత్రల పరిధి మేరకు  చాల బాగా నటించారు.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. శర్వానంద్, సమంత మధ్య సన్నివేశాలు ఆకట్టుకున్నా  కాస్త స్లోగా సాగుతాయి. అయితే వారి పాత్రల మధ్య  లవ్ మ్యాజిక్ ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. మెయిన్ గా సినిమా కాస్త స్లోగా మొదలైనప్పటికీ.. ఆడియన్స్ ని

ఇంటర్వల్ వరకూ మంచి ఫీల్ తో తీసుకొచ్చాడు. స్కూల్ ఎపిసోడ్ సీన్స్, గెట్ టుగెదర్ ఎపిసోడ్, సమంత – శర్వానంద్ ల ఇంటర్వల్ సీన్స్ మంచి ఫీల్ ని క్రియేట్ చేసి ఆడియన్స్ కి వాళ్ళ మెమొరీస్ ని గుర్తు చేశాయి. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాలి. నా కోసం.. తన జాను కోసం నా రామ్ వచ్చేసాడు అంటూ సమంత చెప్పిన కొన్ని లవ్ డైలాగ్ లను కూడా బాగా రాశాడు డైలాగ్ రైటర్ మిర్చి కిరణ్.  దాంతో శర్వానంద్, సమంత ప్రేమ కొన్ని సన్నివేశాల్లో బాగా వర్కౌట్ అయింది.

ఇక సంగీత దర్శకుడు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.  సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్  ఎంతో  రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో  చాలా బ్యూటిఫుల్ గా  చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని  సాగతీత సన్నివేశాలను  తగ్గించి ఉంటే..  సినిమాకి బాగా ప్లస్  అయ్యేది.  నిర్మాత దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.  నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

అయితే కంప్లీట్ లవ్ డ్రామా అవ్వడం, స్లో నేరేషన్ కావడం వలన, రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ లాంటివి లేకపోవడం వలన సినిమాకొంతవరకు బోర్ కొడుతోంది. పైగా సినిమాలో  హీరో చుట్టూ సాగే డ్రామా మరియు బలహీనమైన సంఘర్షణకి లోబడి  బలహీనంగా సాగడం కూడా  బాగాలేదు. అయితే దర్శకుడు హీరో జర్నీని బలంగా ఎలివేట్ చేసినప్పటికీ.. హీరో పాత్రకి వచ్చే  సంఘర్షణ  ఆ  స్థాయిలో లేదు. దీనికి తోడు  సినిమాలో కొన్ని సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా  అనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్ :

► సమంత – శర్వానంద్ ల మధ్య కెమిస్ట్రీ మరియు వారి నటన,

► హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ,

► సినిమాలోని ఎమోషనల్ థీమ్,

► రామ్ – జానుల మేజిక్ కి కనెక్ట్ చేసి మంచి ఫీల్,

► ఇంటర్వల్ సీన్స్.. అండ్ సెకెండ్ హాఫ్ లో లవ్ సీన్స్ మరియు క్లైమాక్స్,

► స్కూల్ ఎపిసోడ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.

మైనస్ పాయింట్స్ :

► స్లోగా సాగే  మెయిన్ లవ్ స్టొరీ,

► సినిమాటిక్ గా సాగే కథనం,

► అక్కడక్కడా ప్లే బోర్ గా ఉండటం,

► డైరెక్షన్ లో కాస్త తమిళ్ నేటివిటి కనిపించడం.

చివరగా..

ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా  వచ్చిన ఈ సినిమా బాగుంది.  స‌మంత – శర్వానంద్ నటనతో పాటు ఎమోషనల్ సాగే ఫీల్‌ గుడ్ సీన్స్ అండ్  ఎమోష‌న‌ల్ సీక్వెన్సెస్ మరియు  క్లైమాక్స్ ఇలా ఓవ‌రాల్‌ గా ప్రతి ఒక్కరికీ ఈ సినిమా ఏదొక ఎపిసోడ్ లో కనెక్ట్ అవుతూ మన పాత జ్ఞాపకాలలోకి తీసుకువెళ్తుంది.  మెయిన్ గా స్కూల్ డేస్‌ లో ప్ర‌తి అమ్మాయి స‌మంత‌ను ఓన్ చేసుకుంటారు. దాంతో జాను బ్యూటిఫుల్ మోమెంట్స్ తో వచ్చిన  మ్యాజికల్ లవ్ స్టోరీగా అనిపిస్తుంది. దానికి తోడు సమంత – శర్వానంద్ లు కూడా తమ పెర్ఫార్మన్స్ తో ఆ మ్యాజిక్ ని ఆడియన్స్ ఫీలయ్యేలా చేశారు.  అయితే ఈ ప్రేమ కథ తంతు కాస్త స్లోగా సాగుతూ కొన్ని ఇంట్రస్ట్ గా సాగని సన్నివేశాలు మరియు సెకెండ్ హాఫ్ మధ్యలో వచ్చే కొన్నిచోట్ల కనెక్ట్ కాని ప్లేతో  సినిమా కాస్త ఇబ్బంది పెడుతుంది. అయినప్పటికీ సినిమాలో మెయిన్ ఎమోషన్ అండ్ నటీనటుల అద్భుతమైన నటన అలాగే సాంకేతిక బృందం పనితనం సినిమాని మరో లెవల్ కి తీసుకువెళ్లాయి.  మొత్తం మీద.. లవర్స్ తో పాటు ఫ్యామిలీస్ కూడా ‘జాను’ను చూడొచ్చు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.