ఉల్లి ధరలపై పవన్ ట్వీట్ !

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Dec 2019 5:33 AM GMT
ఉల్లి ధరలపై పవన్ ట్వీట్ !

హైదరాబాద్ : నిత్యావసర ధరల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఆయన ప్రభుత్వ వైఫల్యంపై ఘాటుగా స్పందించారు. ''ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు ,కానీ జగన్ రెడ్డి గారు చేసే మేలు ఉల్లి కూడా చెయ్యదు, అందుకే ఇంకా ఉల్లి ఎందుకు సిల్లీగా అని దాని రేటు పెంచేశారు.'' అని పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రైతుబజార్ల వద్ద రాయితీతో ఇస్తున్న ఉల్లిపాయల కోసం బారులు తీరిన ప్రజల ఫోటోను పవన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనలో విఫలమైందనేందుకు ఇదే నిదర్శనమన్నారు. మరోవైపు ఉల్లి ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇలాగైతే సామాన్యుడికి రోజు గడిచేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి కోసం తిప్పలు తప్పడం లేదు. రోజు రోజుకూ పెరిగిపోతున్న ధరలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ప్రభుత్వం అందించే రాయితీ ఉల్లి కోసం ఎగబడుతున్నారు. ఒంగోలు రైతు బజారులో రాయితీ ఉల్లి కోసం వినియోగదారులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉండటంతో తమకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని వృద్ధులు, మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు. అదేవిధంగా ఉల్లి కోసం కడపలో రైతు బజారు వద్ద ప్రజలు బారులు తీరారు. వృద్ధులు, చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఉల్లి కోసం పడిగాపులు కాశారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ఉల్లి సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

కొద్ది రోజులుగా ఉల్లి ధరలు పెరుతూనే ఉన్నాయి. తాజాగా ఉల్లి ధర చికెన్ రేట్ ను క్రాస్ చేసింది. రూ.200 చేరుకోవడంతో ఉల్లిని కోయకముందే వినియోగదారులకు కన్నీళ్లొస్తున్నాయి. ఉల్లిని దిగుమతులు తక్కువగా ఉండటం, నిల్వలు లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు సామాన్యులు ఉల్లిని కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది.

తాజాగా ఉల్లికోసం క్యూలైన్ లో నిలబడిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణాజిల్లా గుడివాడలో గల రైతుబజారులో రాయితీతో రూ.25 కి ఇచ్చే కిలో ఉల్లి కోసం సాంబయ్య (65) అనే వ్యక్తి క్యూలైన్ లో నిల్చున్నాడు. ఉదయం నుంచి క్యూలో నిలబడిన అతను కళ్లు తిరిగి పడిపోవడంతో తోటివారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సాంబయ్యను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు.

Next Story