నిజామాబాద్‌: వీరుడా.. నువ్వు చేసిన త్యాగం మరువలేనిది

By సుభాష్  Published on  9 Nov 2020 3:28 AM GMT
నిజామాబాద్‌: వీరుడా.. నువ్వు చేసిన త్యాగం మరువలేనిది

వీరుడా .. నువ్వు చేసిన త్యాగం ఎన్నటికి మరువలేనిది. నీ త్యాగం తెలంగాణ యావత్తు ఎప్పుడు గుర్తించుకుంటోంది. నీ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రోడ్డు-భవనాల, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మచిల్‌ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల పోరుటో వీరమరణం పొందిన నిజామాబాద్‌ జిల్లా కోమన్‌పల్లికి చెందిన జవాను వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ముష్కరుల పోరాటంలో అసువులు బాసిన జవాను మహేష్‌కు యావత్తు తెలంగాణ అండగా ఉంటుందని ఆయన అన్నారు. మహేష్‌కు మంత్రి నివాళి అర్పించారు.

వ్యవసాయ కుటుంబంలో జన్మించిన మహేష్‌ చిన్న తనం నుంచే దేశభక్తి ఎక్కువ. సైన్యంలో చేరాలనే లక్ష్యంతో కుటుంబ సభ్యులను ఒప్పించి గత ఎనిమిది నెలల కిందట సైన్యంలో చేరాడు. భౌతికంగా దూరమైనా.. నీ త్యాగాలు ఎప్పుడు గుర్తిండిపోతాయని మంత్రి అన్నారు. దేశం కోసం ప్రాణాలు ఆర్పించడం స్ఫూర్తిదాయకం. వీర సైనికుడా తెలంగాణ నీకు నివాళి అర్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌, వేల్పూరు వాసిగా నేను అండగా ఉంటా. మహేష్‌ (26) తో పాటు వీరమరణం పొందిన సైనికులకు జోహార్లు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వీర జవాన్ల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.. అంటూ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

కాగా, జమ్మూ కశ్మీర్‌లోని మాచిల్‌ సెక్టార్‌ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి భారీ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు వీరమరణం పొందగా, భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో కుప్వారా జిల్లాలోని ఎల్‌ఓసీ వద్ద ఉగ్రవాదులు అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు. దీనిని గమనించిన భద్రతా బలగాలు వారి ప్రయత్నాన్ని తిప్పికొట్టారు.

దీంతో ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడగా, బలగాలు అప్రమత్తమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ అధికారితో పాటు ముగ్గురు జవాన్లు మరణించారు. అలాగే జవాన్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులను హతమార్చినట్లు ఆర్మీ ప్రతినిధి కల్నల్‌ రాజేష్‌ తెలిపారు. అయితే ముష్కరుల కాల్పుల్లో వీరమరణ పొందిన నలుగురు జవాన్లలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మహేష్‌ కూడా ఉన్నాడు. గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్న మహేష్‌ ఏడాది కాకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లడం ఆ కుటుంబంతో పాటు యావత్తు రాష్ట్ర ప్రజల్లో విషాదాన్ని నింపింది.

Next Story