ఫేమస్ అవ్వడం కోసం 'కరోనా'ని వాడేసుకున్నాడు

By అంజి  Published on  8 Feb 2020 2:47 AM GMT
ఫేమస్ అవ్వడం కోసం కరోనాని వాడేసుకున్నాడు

కొందరు ఎలాగైనా వార్తల్లోకి ఎక్కేయాలనుకుంటారు.ఎలాగైనా ఫేమస్ అవాలని దిక్కుమాలిన పనులు చేస్తుంటారు. అలా చేసి చివరికి ఫేమస్ అవ్వటం సంగతేమేమో గానీ అడ్డంగా తమను తాము బుక్ చేసుకుంటారు. చివరికి ఇదిగో ఈ అబ్బాయిలా రిలాక్స్ గా ఊచలు లెక్కపెట్టుకుంటారు.

ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమస్య కరోనా. చైనాలో పుట్టిన ప్రపంచ దేశాలనూ వణికిస్తోంది. ఇదే అదనుగా కొన్ని పుకార్లు పుట్టుకువస్తున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ప్రజలు మరింత భయభ్రాంతులు అవుతున్నారు. ఇదే అదనుగా తీసుకొని తనకు కరోనా వైరస్ ఉందని విమానంలో హంగామా సృష్టించిన ఓ యువకుడ్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జేమ్స్ పొటోక్ ఫిలిప్పే అనే 28 ఏళ్ల యువకుడు కెనడాలోని టొరంటో నుంచి జమైకాకు విమానంలో వెళుతున్నాడు. ప్రయాణంలో ఒక్కసారిగా తన సీట్లోంచి లేచి తనకు కరోనా సోకినట్టుగా అనుమానం కలుగుతోందని, ఎవరూ తన వద్దకు రావొద్దంటూ కలకలం రేపాడు. అంతేకాదు తాను ఇటీవలే చైనాలోని వుహాన్ నుంచి వచ్చానని చెప్పడంతో ప్రయాణికులు హడలిపోయారు.

దాంతో విమాన సిబ్బంది విమానాన్ని కెనడాలోని పియర్సన్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా కిందికి దించారు. అయితే అధికారుల విచారణలో తాను కావాలనే అబద్ధం చెప్పానని, సోషల్ మీడియాలో విపరీతమైన గుర్తింపు తెచ్చుకునేందుకే ఇలా చేశానని చెప్పడంతో అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి అనుకున్నదే చేసాడు..జైలుకెల్తేనేం ఒక్కసారిగా బాగా ఫేమస్ అయ్యాడు.

Next Story