ప్రపంచాన్ని మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది: సీఎం జగన్
By సుభాష్ Published on 8 Oct 2020 1:30 PM ISTకృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ 'జగనన్న విద్యాకానుక' పథకాన్ని ప్రారంభించారు. ముందుగా జిల్లా పరిషత్ పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలించి తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్థులకు ప్రభుత్వం కిట్లను అందజేస్తోంది. ఈ కిట్‌లో ఒక్కో విద్యార్థికి మూడు జతల దుస్తులు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్యపుస్తకాలు అందిస్తారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్నత విద్యార్థులకు వర్క్ బుక్స్, 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు నోట్ పుస్తకాలను బ్యాగ్‌లో ఇస్తారు. విద్యార్థులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో ఈ స్కూల్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. అలాగే ప్రతి విద్యార్థికి స్కూల్ కిట్‌తో పాటు మూడు మాస్కులు కూడా అందించనున్నారు. యూనిఫామ్ కుట్టు కూలి మూడు జతలకు రూ.120 చొప్పున విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. సీఎం జగన్ విద్యార్థులను అప్యాయంగా పలకరించి వారితో కాసేపు ముచ్చటించారు. తరగతి బల్లలపై కూర్చుని విద్యార్థుల అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువే తరగని ఆస్తి అని, ప్రపంచాన్ని మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో 34 శాతం మంది చదువు రాని వారున్నారని, విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని అన్నారు. మన బడి నాడు-నేడు కార్యక్రమాలు చేపట్టామని, వాటి ద్వారానే పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని అన్నారు. ప్రపంచంతో పోటీపడే పరిస్థితి మన పిల్లలకు రావాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.