వెలగపూడి : ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆఖరిరోజు వాడీవేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు రాష్ర్ట పాలనపై పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. టీడీపీ సభ్యులు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సభా హక్కుల నోటీసులిచ్చారు. ఈ నోటీసులపై స్పందించిన జగన్ టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలు పచ్చి అబద్ధాలాడుతున్నారని మండిపడ్డారు. ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ గురించి టీడీపీ సభ్యులు ప్రస్తావించడంతో…జగన్ ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ పెట్టామన్నారు. గతంలో ఔట్ సోర్సింగ్ పేరుతో లంచాలు తీసుకున్నారని, గుళ్లలోని పారిశుద్ధ్య పనుల కాంట్రాక్ట్‌ను కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన బంధువుకు ఇప్పించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు చెప్పండి ఔట్ సోర్సింగ్ పేరుతో లంచాలు తీసుకుంది ఎవరు ? అని జగన్ అసెంబ్లీ వేదికగా చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లను ఇచ్చేందుకు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ తీసుకొస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఉద్యోగులకు న్యాయం చేసేందుకే ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం మంచి ఉద్దేశ్యంతో కార్యక్రమాలు చేస్తుంటే ప్రతిపక్ష నేతలు ప్రతి దానిలో అవాస్తవాలు, వక్రీకరణలు చేస్తున్నారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై మంత్రులేమన్నారంటే..
వైసీపీ కార్యకర్తల కోసమే కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ర్టంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించే పనిని జగన్ ఇన్ చార్జ్ మంత్రులకు అప్పగించి, 6 నెలల్లో రెగ్యులరైజ్ చేస్తామని చెప్తూ మోసం చేస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు. అచ్చెన్న చేసిన వ్యాఖ్యలపై మంత్రి బుగ్గన స్పందించాు. అచ్చెన్నాయుడు చెప్పేవన్నీ అవాస్తవాలని, అబద్ధాలు చెప్తున్న అచ్చెన్నకు సభా హక్కుల నోటీసులిస్తామన్నారు. ఆ తర్వాత కన్నబాబు మాట్లాడుతూ.. టీడీపీ ఒక అబద్ధాల ఫ్యాక్టరీ అని ఆరోపించారు. ప్రస్తుతం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల దీన పరిస్థితికి కారణం టీడీపీనేనన్నారు. టీడీపీ హయాంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకోలేదని కన్నబాబు ఎద్దేవా చేశారు. రాష్ర్టంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేసేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేశామని సీఎం జగన్ మధ్యలో కలుగజేసుకుని చెప్పారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.