జగన్‌ ఎన్డీఏలో చేరుతున్నాడా..?.. మోదీ ప్లాన్ ఏంటీ..?

By సుభాష్  Published on  12 Feb 2020 3:52 PM GMT
జగన్‌ ఎన్డీఏలో చేరుతున్నాడా..?.. మోదీ ప్లాన్ ఏంటీ..?

ముఖ్యాంశాలు

► ప్రధానితో ఏపీ సీఎం భేటీ

► గంటన్నర పాటు సుదీర్ఘ చర్చలు

► రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం మారిన జగన్‌ భేటీ

► దేశ రాజకీయాల్లో బీజేపీ కొత్త ఎత్తుగడలు..

ఏపీలో బంపర్‌ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు మారిపోతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు జగన్‌ను తిట్టిన వారు..ఇప్పుడు మాకెందుకులే అన్నట్లు ఉంటూ జగన్‌ను పొగుడుతున్నారు. తాజాగా బుధవారం జగన్‌ ప్రధాని నరేంద్రమోదీతో సుమారు గంటన్నర పాటు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరికి తెలియదు.

తాజాగా ఇంకో విషయం గుప్పుమంటోంది. జగన్‌ను బీజేపీ ఏకంగా ఎన్డీఏలోకి ఆహ్వానిస్తోందని, కేంద్ర మంత్రి వర్గంలో చేరాలని చెబుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. అంతేకాకుండా ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ సర్కార్‌ సుముఖంగా ఉంది. ఇక జగన్‌పై అక్రమాస్తుల కేసు ఉండటం, రాష్ట్రానికి నిధులు అవసరం ఉండటం లాంటివి మోదీ సర్కార్‌ బెస్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎన్డీఏలో చేరేందుకు జగన్‌ ఆసక్తి చూపుతున్నారా..?

బీజేపీ సూచన మేరకు ఏన్డీఏలో చేరే అంశంపై సీఎం జగన్‌ స్పష్టమైన ప్రకటన చేయకపోయినప్పటికీ.. ఆ కూటమిలో చేరేందుకు జగన్‌ ఆసక్తి చూపుతున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా, ఎవరి మద్దతు లేకుండా ఎన్డీఏ అధికారంలో వచ్చింది కాబట్టి ఇప్పుడేమి చేయలేమని, సీట్లు తక్కువగా వచ్చి ఉంటే ఎన్డీఏకు మద్దతు నిలిచి ప్రత్యేక హోదా సాధించుకునేవారమని, కానీ అందుకు వ్యతిరేకంగా జరిగిందని గతంలో అమిత్‌షాతో జగన్‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సీఎం జగన్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇచ్చేశారు. ఈ భేటీలో సుమారు గంటన్నరపాటు భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అంతేకాకుండా రాబోయే రోజుల్లో జగన్‌ పార్టీకి రాజ్యసభ సీట్లు వస్తాయి. మోదీకి రాజ్యసభలో మద్దతు అవసరం. అలాగే ఒకసారి ఇద్దరమూ కలిసి చంద్రబాబును తొక్కేసి సెకండ్‌ ప్లేస్‌లోనైనా ఎదగాలనేది బీజేపీ ఆలోచన ఉన్నట్లు రాజకీయ వర్గాలు గుసగులాడుకుంటున్నాయి.

తాజాగా ఢిల్లీలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అంతకు ముందు మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో చేదు అనుభవం ఎదురైంది. బలమైన ప్రాంతీయ పార్టీలతో కలిసి కొత్త సమీకరణాల్లో ముందుకెళ్లాలనేదే బీజేపీ ప్లాన్‌. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు బలమైన కూటమి ఏర్పడకుండా ముందుగానే బలమైన ప్రాంతీయ పార్టీలతో కలిసి నడవాలనేది కమల దళం వేస్తున్నప్లాన్‌గా తెలుస్తోంది. ఇక రాబోయే నాలుగేళ్లలో తన పాలన సాఫీగా జరగడానికి, బిల్లులు పాస్‌ కావడానికి, హస్తం పార్టీ మరింతగా ముందుకెళ్లకుండా కత్తెర్లు వేసేందుకు ఇదే సరైన మార్గమని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తాము రెండో స్థానంలో వెళ్లగలమని నమ్మకం ఉన్న చోట అక్కడి ప్రాంతీయ పార్టీలతో పోరాటం చేస్తూనే ఉండాలి. ఆ విధంగానే బీజేపీ వైసీపీని ఆహ్వానిస్తోంది. కాగా, ఇటీవల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సైతం బీజేపీతో చేతులు కలిపారు.

డీఎంకేకు బీజేపీ గాలం..

అలాగే తమిళనాడులో డీఎంకేకు కూడా బీజేపీ గాలం వేస్తోంది. డీఎంకేకు మోదీ టీం ఆహ్వానిస్తోంది. కణిమొళిని కేబినెట్‌లోకి తీసుకుంటామని చెబుతోంది. ఇక బీజేపీ ప్లాన్‌ ఏంటంటే.. ఇప్పట్లో తమిళనాడులో తమకు పెద్దగా ఒరిగేది లేదని, వీలైనంత తొందరగా ద్రవిడ రాజకీయాలను అయోమయ స్థితిలోకి లాగాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళనాడులో అన్నా డీఎంకే అయోమయ స్థితిలో ఉంది. ఒక వేళ శశికళను జైలు నుంచి విడుదల చేసినా.. పాత పార్టీ మొత్తం ఆమె వెంట వెళ్లే అవకాశాలు లేవు.

మరో వైపు డీఎంకే బలోపేతంగా కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్‌, లెప్ట్‌ పార్టీలతో జతకట్టి ఉంది. అందుకే డీఎంకేను తమ వెంట ఉంచుకుని కాంగ్రెస్‌కు, లెప్ట్‌ పార్టీకి కత్తెర వేయాలనేదే కషాయ పార్టీ వేస్తున్న ఎత్తుగడలు. ఎందుకంటే డీఎంకే రాజ్యసభ బలం కూడా మోదీకి ఎంతో ఉపయోగం. సో ఈ దిశగా బీజేపీ పక్కాప్లాన్‌తో ముందుకెళ్తోంది.

Next Story