ఇదీ రాజకీయ రక్త సంబంధాల పవర్
By Newsmeter.Network Published on 26 Jan 2020 10:23 AM ISTభార్యా భర్త, అన్నా చెల్లి, అక్కా తమ్ముడు, అన్నా తమ్ముడూ.. ఇవేమిటి ఈ సంబంధాలన్నిటినీ ఏకరువు పెడుతున్నారేమిటి అనుకోకండి. శనివారం వెలువడ్డ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ రక్త సంబంధాల పవరేమిటో చూపించింది. పేరుకు ప్రజాస్వామ్యమే అయినా పొలిటికల్ కుటుంబాల పవర్ ను ఎత్తి చూపింది. తెలంగాణ మొత్తంలో కేసీఆర్ కుటుంబం అధికార దరహాసాలు చిందిస్తున్నట్టే గల్లీలో, పల్లెల్లో కూడా పలు రాజకీయ కుటుంబాలు తమ ప్రభావ ప్రాభవాలను చూపించుకున్నాయి.
నిజాంపేట మునిసిపాలిటీలో వార్డు 31 నుంచి ప్రణయ యాదవ్ టీఆర్ ఎస్ తరఫున గెలుపొందింది. ఆమె భర్త ధనరాజ్ యాదవ్ 28 వ వార్డును గెలుచుకున్నారు. ఆయనదీ టీఆర్ ఎస్సే. కలిసి “నీకు నేను నాకు నువ్వు” “నువ్వు లేక నేను లేను” నువ్వే నేను” అనుకుంటూ ప్రచారం చేసుకున్నారు. వారిద్దరూ పోటీ చేయడం ఇదే తొలిసారి. కానీ వారి కుటుంబం మాత్రం మొదట్నుంచీ పీకల్లోతు రాజకీయాల్లో ఉంది. ధనరాజ్ తల్లి ప్రమీలా శైలు యాదవ్ నిజాంపేటకు మాజీ సర్పంచ్. వారిద్దరూ ప్రజలకు ఇచ్చిన హామీ ఏమిటంటే ప్రమీలా శైలు యాదవ్ ఆశయాలను కొనసాగించడం. నిజాంపేట అందాలను పెంచడం, మునిసిపాలిటికి ఒక స్మశానాన్ని ఏర్పాటు చేయడం వారి లక్ష్యాలు.
పొరుగునే ఉన్న నార్సింగి మున్సిపాలిటీలోనూ భార్యా భర్తలు విజయం సాధించారు. నలభై ఏడేళ్ల గొర్ల వెంకటేశ్ యాదవ్, ఆయన భార్య అరుణ జ్యోతిలు చెట్టాపట్టాలు వేసుకుని ఓటు ఆట ఆడారు. ఆడి గెలిచారు. వీరిద్దరూ టీఆర్ ఎస్ వారే. తమాషా ఏమిటంటే అరుణ జ్యోతి తన గెలుపును మహిళా లోకం గెలుపు అని ప్రకటిస్తే , వెంకటేశ్ యాదవ్ ఇది అందరి గెలుపు అని చెప్పుకొచ్చారు.
అలాగే బండ్లగుడా మున్సిపాలిటీలో అక్క సంతోషి కుమారి మూడో వార్డు నుంచి గెలిస్తే, తమ్ముడు రాజేందర్ రెడ్డి 15 వ వార్డు నుంచి గెలిచారు. ఇద్దరూ మంచి మెజారిటీతో గెలిచారు. “ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగ పనిచేస్తామని” ఇద్దరూ ప్రకటించారు. మొత్తం మీద కుటుంబ ఫార్ములా టీఆర్ ఎస్ కు పైనుంచి కింద దాకా కలిసొచ్చినట్టుంది.