ముఖ్యాంశాలు

  • రామానాయుడు స్టుడియో పై ఐటీ అధికారులు దాడులు
  • రామానాయుడు స్టుడియో తో పాటు మొత్తం పది చోట్ల సోదాలు
  • కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు

హైదరాబాద్‌: మూవీ మొఘల్ రామానాయుడు కుమారుడు, ప్రముఖ సినిమా నిర్మాత సురేష్ బాబుకు చెందిన రామానాయుడు స్టుడియో పై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి వారికి చెందిన పలు కార్యాలయాల్లో దాడులు మొదలయ్యాయి. రామానాయుడు స్టుడియో తో పాటు మొత్తం పది చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీ హిల్స్‌లోని సురేష్‌ బాబు నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

రామానాయుడు నిర్మాతగా ఉన్నంత కాలంగా వరుసగా సినిమాలు నిర్మించిన సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఇటీవల పెద్దగా నిర్మాణం చేయటం లేదు. ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్‌ మీద దృష్టి పెట్టిన సురేష్‌ బాబు కంటెంట్‌ ఉన్న చిన్న సినిమాలను సమర్పిస్తూ సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్‌లో వెంకటేష్‌, నాగచైతన్య హీరోలుగా వెంకీ మామ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కాయి. సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు స్టూడియో లావాదేవీలపై అనుమానాలు రావడంతో ఐటి అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ సంస్థ ఇటీవల జరిపిన లావాదేవీల వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. డ్యాకుమెంట్లపై సురేష్‌ బాబు, కుటుంబ సభ్యుల నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

తాజాగా సురేష్ ప్రొడక్షన్స్‌ నిర్మించిన సినిమాలకు సంబంధించి ఐటీ రిటర్న్స్‌ చెల్లింపుపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆర్థిక లావా దేవీలపై అనుమానాలు రావడంతోనే ఐటీ అధికారులు తనిఖీలు జరుగుతున్నాయని సమాచారం. సురేష్‌ బాబుకు సంబంధించిన అన్ని కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖ రామానాయుడు స్టూడియోలో సోదాలు జరగడం చూస్తుంటే మరికొంత మంది నిర్మాతల కార్యాలయాల్లో కూడా ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని తెలస్తోంది. రామానాయుడు స్టూడియోపై ఐటీ దాడులు జరుగుతుండడంతో ప్రస్తుతం టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఇదే హట్‌ టాఫిక్‌గా మారింది.

సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్,దగ్గుబాటి ఫార్స్ అండ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, రాజేశ్వరి ఫార్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్,సురేష్ ప్రొడక్షన్స్ ఎంటర్టైన్మెంట్ ఎల్ ఎల్ పి,సురేష్ ప్రొడక్షన్స్ , సురేష్ యాడ్స్ కంపెనీ ల ఫై కొనసాగుతున్న ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

హీరో విక్టరీ వెంకటేష్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పుప్పాలలోని డాలర్‌హిల్స్‌ తన నివాసంలో ఉదయం నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కాగా ఐటీ అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

సత్య ప్రియ బి.ఎన్