5వికెట్లు.. 11వ సారి.. జహీర్‌ సరసన ఇషాంత్..

By Newsmeter.Network  Published on  23 Feb 2020 6:21 AM GMT
5వికెట్లు.. 11వ సారి.. జహీర్‌ సరసన ఇషాంత్..

టీమిండియా సీనియర్‌ ఫాస్టు బౌలర్‌ ఇషాంత్ శర్మ న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక ఐదు వికెట్లు తీసిన రెండో భారత పేసర్‌గా జహీర్‌ సరసన ఇషాంత్‌ చేరాడు. జహీర్‌ 92 టెస్టుల్లో 11 సార్లు ఐదు వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్‌ 97 టెస్టుల్లో ఈ ఘనతను అందుకున్నాడు.

ఓపెనర్లు టామ్‌ లాథమ్‌, టామ్‌ బ్లన్‌డెల్‌, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌లతో పాటు టెయిలెండర్లు టిమ్‌ సౌతీ, ట్రెంట్‌ బౌల్ట్‌ల వికెట్లను ఇషాంత్‌ పడగొట్టాడు. దీంతో టెస్టుల్లో ఇషాంత్ వికెట్ల సంఖ్య 297కి చేరింది. మరో మూడు వికెట్లు తీస్తే భారత్‌ తరుపున టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్‌లో చేరతాడు. ఈ టెస్టు ప్రారంభానికి నాలుగు రోజుల ముందు మాత్రమే ఇషాంత్ కివీస్‌లో అడుగుపెట్టాడు.

51 నుంచి 183కు ఆధిక్యం..

రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్‌ ఐదు వికెట్లు పడగొట్టారు. మూడో రోజు తొందరగా తోక కత్తిరించేస్తే వందలోపే అధిక్యం ఉంటుంది అనుకున్న కోహ్లీ సేనకు న్యూజిలాండ్‌ టెయిలెండర్లు షాక్‌ ఇచ్చారు. ధాటిగా బ్యాటింగ్‌ చేసి..183 పరుగుల ఆధిక్యాన్ని కివీస్‌ కు అందించారు.

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 216/5తో మూడో రోజు ఆటను ఆరంభించిన తొలి బంతికే వాట్లింగ్‌(14)ను ఔట్‌ చేసి టీమిండియా శిబిరంలో బుమ్రా ఆనందం నింపాడు. అనంతరం ఇషాంత్ బౌలింగ్‌ లో టీమ్‌సౌతీ(6) షమీకి క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తరువాత గ్రాండ్‌హోమ్‌(43; 74 బంతుల్లో 5ఫోర్లు)‌, కైల్‌ జేమీసన్‌(44; 45 బంతుల్లో 1ఫోర్‌, 4 సిక్సర్లు) ధాటిగా ఆడి ఎనిమిదో వికెట్‌ కు 71 పరుగులు జోడించారు. ఈ జోడిని అశ్విన్‌ విడగొట్టాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో జేమీసన్‌ హనుమ విహారికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

చివర్లో ట్రెంట్‌ బౌల్డ్‌ (38; 24 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్‌) ధాటిగా ఆడాడు. దీంతో న్యూజిలాండ్‌ 348 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో ఇషాంత్‌ శర్మ (5/68), అశ్విన్‌(3/99)లు రాణించగా.. షమీ, బుమ్రాలు తలో వికెట్‌ దక్కించుకున్నారు.

Next Story