ఇప్పటికే రెవెన్యూ లోటుతో సతమతమవుతోన్న కేంద్రం ఆ భారాన్ని జీఎస్టీ రేట్ల పెంపుతో పూడ్చనుంది. ఈ నెల 18వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో శ్లాబులను కుదించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. జీఎస్టీ వసూళ్లు తగ్గడంతో రాష్ర్టాలకు చెల్లించాల్సిన పరిహారాలు బకాయి పడటంతో ఈ సమావేశం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ప్రస్తుతం జీఎస్టీలో 5,12,18,28 శాతం చొప్పున నాలుగు శ్లాబులున్నాయి. ఇప్పుడున్న జీఎస్టీ రేటును 5 శాతం నుంచి 8 శాతానికి, 12 శాతంగా ఉన్న రేటును 15 శాతానికి పెంచాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేట్ల పెంపుపై జీఎస్టీ మండలి సమావేశంలో ఓ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. జీఎస్టీ పెంపుతో పాటు పలు వస్తువులపై విధిస్తున్న సెస్ ను కూడా పెంచనున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జీఎస్టీలో ఉన్న నాలుగు శ్లాబులను మూడుకు కుదించే అంశాన్ని కూడా జీఎస్టీ మండలి పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

2018-19 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ – నవంబర్ నెలల మధ్యలో సీజీఎస్టీ వసూళ్లు ఏకంగా 40 శాతానికి పడిపోయాయి. దీనితో పాటు జీడీపీ వృద్ధి రేటు కూడా కేంద్రానికి నిద్రపట్టకుండా చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు ఏకంగా 4.5 శాతానికి పడిపోవడం గమనార్హం. అంతేకాక ఇది 26 త్రైమాసికాల కనిష్ఠ వృద్ధిరేటు కావడం కేంద్రం గుండెల్లో గుబులు పుడుతోంది. అందుకే కేంద్ర ఖజానా నింపే మార్గాలపై సూచనలు, సలహాలివ్వాల్సిందిగా జీఎస్టీ మండలి కేంద్ర, రాష్ర్టాల అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీకి లేఖ పంపింది. నిజంగానే వచ్చే వారం జరగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో శ్లాబు రేట్లు పెరిగితే మళ్లీ సామాన్యుడిపై భారం పడటం ఖాయం. ఇప్పటి వరకూ రేట్లు తక్కువగా ఉన్న టీవీ, మొబైల్, ఇత ఎలక్ట్రిక్ వస్తువుల రేట్లతో పాటు సామాన్యుడికి అవసరమయ్యే అన్ని వస్తువల రేట్లపై 3 శాతం జీఎస్టీ పెరుగుతుంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.