నిజ నిర్ధారణ: వాట్సాప్ లో గూగుల్ పే స్క్రాచ్ కార్డ్ తో నిజంగా డబ్బులు పొందవచ్చా??
By సత్య ప్రియ Published on 5 Dec 2019 12:26 PM GMTడబ్బు లావాదేవీలను టెక్నాలజీ సులభతరం చేసింది. బ్యాంకుకు వెళ్లి క్యూ కట్టాల్సిన అవసరం లేకుండా క్షణాల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. దేశంలో లావాదేవీలు చేసే ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి యూపిఐ యాప్లు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు లాగా కాకుండా కేవలం స్మార్ట్ ఫోన్ తో అన్ని చేసేయొచ్చు.
వేరు వేరు బ్యాంక్ అకౌంట్లను ఒకే మొబైల్ అప్లికేషన్ లోకి ఉంచి డబ్బు బదిలీ, ఆన్ లైన్ లావాదేవీలు చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆధీనంలో ఉండే యుపిఐ యాప్ల ద్వారా ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ కి డబ్బులు సులభంగా బదిలీ చేయొచ్చు. డీమానెటైజేషన్ తరువాత మార్కెట్ లోకి ఎన్నో యుపిఐ యాప్లు వచ్చాయి. యూజర్లను తమవైపుకి ఆకర్షించడానికి వారు ఎన్నో పధకాలు కూడా ప్రవేశపెట్టారు. కొన్ని యాపులు ప్రతి లావాదేవికి స్క్రాచ్ కార్డ్ లను బహుమతిగా యూజర్లకు ఇస్తున్నారు.
ఇటీవల, వాట్సాప్ లో ఒక మెసేజ్ తిరుగుతోంది. లింక్‌పై క్లిక్ చేసి లభించిన స్క్రాచ్ కార్డుతో రూ.500 నుండి రూ.5000 వరకు పొందండి అన్నది ఆ మెసేజ్ సారాంశం. ఆ మెసేజ్ కింద ఓ లింక్ కూడా ఉంది.
నిజ నిర్ధారణ:
లింకు పైన క్లిక్ చేసిన వెంటనే స్క్రాచ్ కార్డు ని చూపుతూ ఒక విండో వస్తుంది.
దానిపై స్క్రాచ్ చేయగానే రూ 899 గెలుచుకున్నట్టు మెసేజ్ వస్తుంది.
వెంటనే, మీరు గెలుచుకున్న డబ్బు మీ ఖాతాలోకి రావాలంటే, ఈ మెసేజ్‌ను వాట్సప్‌లో మరికొందరికి పంపాలన్న మెసేజ్ కనిపిస్తుంది.
అయితే, ఇతరులకు ఈ మేసేజ్ ను పంపినా మనకు ఆ డబ్బు రాదు. ఆ తర్వాత ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని, మీ సమాచారం ఇవ్వాలని మెసేజ్ వస్తుంది. అంతేకాకుండా, మన స్నేహితులు, బంధువులూ కూడా ఈ ఉచ్చులోకి దిగుతారు.
ఈ క్రమంలో ఆ సైట్ యొక్క యు అర్ ఎల్ మారుతుండడం మనం చూడొచ్చు.
ఇటువంటి మెసేజిల ద్వారా ఎంతోమంది మోస పోయారు.
ఎస్ ఎం ఎస్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ ఇలాంటి మెసేజ్ కనుక వస్తే చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని సైబర్ క్రైం పోలీసులు చెప్తున్నారు.
మన బ్యాంక్ లేదా యుపిఐ ఖాతా వివరాలు ఎవరితోనూ షేర్ చేయకూడదని అధికారులు చెప్తున్నారు. ఎటువంటి మోసపూరిత లింకుల పైన క్లిక్ చేయకూడదని, అలా చేస్తే ముప్పు తప్పదని వారు అంటున్నారు.
యూపీఐ పేమెంట్స్ చాలా సులువు కానీ... లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మీ అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. మీరు ఏ యూపీఐ యాప్ ఉపయోగిస్తున్నా సరే అప్రమత్తంగా ఉండాల్సిందే.