కరోనా.. ఇరానీ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లిందిగా..!  

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 March 2020 3:37 PM GMT
కరోనా.. ఇరానీ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లిందిగా..!  

హైదరాబాద్.. ఎన్నో దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడకు వచ్చి హాయిగా చదువుకుంటూ ఉంటుంటారు. సంవత్సరానికి ఒక్కసారి సొంత దేశానికి వెళ్లడమో.. లేదా ఆ విద్యార్థి కుటుంబసభ్యులు ఇక్కడకు రావడమో జరుగుతూ ఉంటుంది. ఇరాన్ కు చెందిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ దేశస్థులకు 'నౌరుజ్' చాలా ముఖ్యమైంది. ఈసారి నౌరుజ్ తాము అనుకున్న విధంగా జరుపుకోడానికి కుదరడం లేదని ఇరాన్ కు చెందిన విద్యార్థులు చెబుతున్నారు. అందుకు కారణం కరోనా వైరస్ అని అంటున్నారు విద్యార్థులు.

నౌరుజ్ ను 'పర్షియన్ న్యూ ఇయర్' గా జరుపుకుంటారు. హైదరాబాద్ లోని ఇరానియన్ విద్యార్థులు తమ సొంత ఊళ్లకు వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులతో జరుపుకుంటూ ఉంటారు. లేదంటే విద్యార్థుల కుటుంబ సభ్యులే భారత్ కు వస్తూ ఉంటారు. కానీ ఈ ఏడాది పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. కోవిద్-19 ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతూ ఉండడంతో ఇరాన్ విద్యార్థులు తమ ప్లాన్ లలో మార్పులు చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది తమ ఫ్లైట్ టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నారు.

ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం అని.. నౌరుజ్ ను కుటుంబ సభ్యులతో జరుపుకోడానికి ప్రతి సంవత్సరం తాను తెహ్రాన్(ఇరాన్ రాజధాని)కు వెళుతూ ఉంటానని కానీ ఈ సంవత్సరం అది కుదరడం లేదని ఎలీ చెప్పుకొచ్చింది. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రబలడం, అలాగే ప్రయాణాల విషయంలో కొన్ని ప్రత్యేక నిబంధనలు ఏర్పరచడంతో తాను సొంత ఊరికి వెళ్లలేకపోయానని బాధపడుతూ చెప్పింది ఎలీ. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది ఎలీ.

ఎలీ రూమ్ మేట్ అజాదే కూడా తమ కుటుంబసభ్యులను కలుసుకునే నిర్ణయాన్ని విరమించుకుంది. ముంబై నుండి తెహ్రాన్ కు తాను టికెట్స్ బుక్ చేసుకున్నానని.. కొన్ని రోజుల క్రితమే టికెట్స్ ను క్యాన్సిల్ చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఇంటి దగ్గర కూడా పరిస్థితులు అంత బాగా లేవని.. ప్రతి ఒక్కరూ ప్రాణాంతకమైన వైరస్ గురించి భయపడుతున్నారని అజాదే చెప్పింది. సొంత ఊళ్ళో ఉంటున్న తమ కుటుంబ సభ్యులు, తనకు తెలిసిన వాళ్ళకెవరికీ కరోనా వైరస్ సోకలేదని చెప్పుకొచ్చింది అజాదే. అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంది. అజాదే నిజాం కాలేజీలో సెకండ్ ఇయర్ బిఏ(పిఇపి) చదువుతోంది. 2017లో హైదరాబాద్ కు వచ్చిన అజాదే ప్రతి సంవత్సరం ఈ సమయానికి తమ సొంత ఊరికి వెళుతోంది. గతేడాది, 2018 లో కూడా తాను తెహ్రాన్ కు వెళ్లి వచ్చానని ఆమె చెబుతోంది. మార్చి 20, శుక్రవారం నాడు పర్షియన్ కొత్త సంవత్సరాన్ని జరుపుకోనున్నారు.

ఓయూ లా కాలేజీ విద్యార్థిని మర్యమ్ కౌహెస్తానీ తల్లిదండ్రులు భారత్ కు రానుండడంతో చాలా ఆనందంగా ఉండేది. పర్షియన్ కొత్త సంవత్సరాన్ని తన తల్లిదండ్రులతో జరుపుకోబోతున్నానని.. భారత్ కు తొలిసారి రాబోతున్న తల్లిదండ్రులకు న్యూ ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు, ఆగ్రా లోని తాజ్ మహల్ చూపించాలని ముందే లిస్ట్ రాసిపెట్టుకుంది. కానీ కరోనా వైరస్ దెబ్బకు తన తల్లిదండ్రుల భారత్ ట్రిప్ క్యాన్సిల్ అయిందంటూ బాధతో చెప్పుకొచ్చింది. మర్యమ్ మజాన్దరన్ ప్రావిన్స్ కు చెందిన అమ్మాయి. తమ ప్రాంతంలో ఇప్పటి వరకూ రెండు కేసులు మాత్రమే పాజిటివ్ అని వచ్చాయని.. మిగిలిన వారంతా ఇళ్లల్లోనే జాగ్రత్తగా ఉన్నారని అంది. తమ తల్లిదండ్రులు టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారని.. తన ఇరానీ, ఆఫ్ఘానీ స్నేహితులతో ఆనందంగా పండుగను సెలెబ్రేట్ చేసుకుంటానని చెప్పుకొచ్చింది.

Next Story